[t4b-ticker]

జూరాల ముట్టడికి బీఆర్‌ఎస్‌ పిలుపు

•మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి ముందస్తు అరెస్టు

వనపర్తి ప్రతినిధి, సెప్టెంబర్ 21, ప్రతిపక్షం: జూరాల ఆయకట్టు రైతులకు సాగునీటిని విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ బీఆర్‌ఎస్‌ జూరాల ప్రాజెక్టు ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు ముందస్తు అరెస్టులకు దిగారు. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డిని తన వ్యవసాయ క్షేత్రంలో పోలీసులు అదుపులోకి తీసుకుని వనపర్తిలో గృహనిర్బంధంలో ఉంచారు. మరోవైపు బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలను పలుచోట్ల ముందస్తుగా అదుపులోకి తీసుకుంటున్నారు.వనపర్తి, ఆత్మకూర్‌, అమరచింత, నర్వ మండలాలకు చెందిన బీఆర్‌ఎస్‌ నాయకులను పోలీసులు ఎక్కడికక్కడే అదుపులోకి తీసుకుంటున్నారు. జూరాల ప్రాజెక్టు వైపు బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు వెళ్లకుండా పోలీసులు తనిఖీలు చేపడుతున్నారు.జూరాల ప్రాజెక్టును పోలీసులు పూర్తిగా దిగ్బంధించారు. ఆనకట్ట పరిసరాల్లో భారీగా పోలీసు బలగాలను మోహరించారు.అనుమానితులను ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకుని జూరాల వైపు రాకుండా కట్టడి చేస్తున్నారు. ముట్టడి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉన్న బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యేలను కూడా ముందస్తుగా అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు.బీఆర్‌ఎస్‌ ముఖ్య నేతల ఇళ్ల వద్ద ఇంటెలిజెన్స్‌ పోలీసులను కూడా రంగంలోకి దించారు. దీంతో జూరాల ప్రాజెక్టు పరిసరాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Spread the love

Related News