బ్రహ్మంగారి జీవిత ఘట్టాలకు రంగస్థల నీరాజనం!

తిమ్మాయిపల్లిలో వీరబ్రహ్మేంద్ర స్వామి పౌరాణిక నాటకోత్సవం

భక్తి పారవశ్యంలో ప్రేక్షకులు..

గ్రామీణ కళాకారుల అద్భుత అభినయం

ప్రతిపక్షం, నంగునూరు, అక్టోబరు 15: రంగస్థలంపై బ్రహ్మంగారి జీవిత ఘట్టాలు ఆవిష్కృతమయ్యాయి.. కళాకారుల అభినయానికి ప్రేక్షకులు మంత్ర ముగ్ధులయ్యారు. భక్తి, ఆధ్యాత్మికత ఉట్టిపడేలా సాగిన చారిత్రక, పౌరాణిక నాటక ప్రదర్శనతో తిమ్మాయిపల్లి గ్రామం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి జీవిత చరిత్రను భావితరాలకు పరిచయం చేయాలనే సంకల్పంతో చేపట్టిన రెండు రోజుల నాటకోత్సవం బుధవారం ప్రారంభమై గురువారం కొనసాగింది. సిద్ధిపేట జిల్లా నంగునూరు మండలం తిమ్మాయిపల్లిలో గ్రామస్తులు నాట్య మండలిగా ఏర్పడి ఈ నాటక ప్రదర్శనను నిర్వహించారు.

రెండు రోజుల పాటు ప్రదర్శించిన నాటకం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. స్థానిక కళాకారులు తమ సహజమైన నటనతో వీరబ్రహ్మేంద్ర స్వామి జీవితంలోని ముఖ్య ఘట్టాలను కళ్లకు కట్టినట్లు ఆవిష్కరించారు. సంభాషణలు, పాత్ర ధారణతో నాటకానికి జీవం పోశారు. గ్రామంలో ఆధ్యాత్మిక భావాలను పెంచి, మహాత్ముల జీవిత చరిత్రను యువతరానికి అందించేందుకు ఈ నాటకోత్సవాన్ని నిర్వహించినట్లు గ్రామ సర్పంచ్ చేర్యాల రాజు, వీరబ్రహ్మేంద్ర స్వామి నాట్య మండలి కమిటీ సభ్యులు తెలిపారు. పౌరాణిక నాటకాల ద్వారా భక్తి తత్వాన్ని చాటి చెప్పడంతో పాటు గ్రామీణ కళలను ప్రోత్సహించవచ్చని పేర్కొన్నారు.

రెండు రోజుల నాటక ప్రదర్శన

బుధ, గురువారాల్లో రెండు భాగాలుగా నాటకాన్ని ప్రదర్శించారు. రెండు రోజుల ప్రదర్శనను తిలకించేందుకు తిమ్మాయిపల్లి, పరిసర గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. భక్తి భావంతో నాటకాన్ని ఆస్వాదించారు. ఈ కార్యక్రమంలో నాట్యమండలి కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, నటులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News