వార్షిక తనిఖీల్లో భాగంగా సిర్పూర్ -యు పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ నితికా పంత్, ఐపీఎస్

అసాంఘిక కార్యకలాపాలను పూర్తిగా రూపుమాపలి

మారు మూల గ్రామాల్లో గంజాయి సాగు,అక్రమ రవాణాపై నిఘా.. పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలీ

పెండింగ్ కేసుల దర్యాప్తు పూర్తి చేసి బాధితులకు సత్వర న్యాయం అందించాలి

గ్రామస్థాయిలో వీపిఓ విధానంలో అమలు చేస్తూ పోలీసు-ప్రజల మధ్య సత్సంబంధాలను బలోపేతం చేయాలి

ప్రతిపక్షం ప్రతినిధి కుమురం భీమ్ ఆసిఫాబాద్, నవంబర్28: వార్షిక తనిఖీల్లో భాగంగా జిల్లా ఎస్పీ నితికా పంత్, ఐపీఎస్ శనివారం సిర్పూర్ -యు పోలీస్ స్టేషన్ తనిఖీ చేశారు.పర్యావరణ పరిరక్షణలో భాగంగా పోలీస్ స్టేషన్ ఆవరణలో జిల్లా ఎస్పీ మొక్కను నాటారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి,వాటి సంరక్షణ బాధ్యతను తీసుకోవాలని సూచించారు.

అనంతరం పోలీస్ సిబ్బందికి పరేడ్ నిర్వహించారు. సిబ్బంది క్రమశిక్షణ, విధి నిర్వహణ తీరును పరిశీలించిన జిల్లా ఎస్పీ, ప్రజలకు మరింత మెరుగైన పోలీస్ సేవలు అందించేందుకు అంకితభావంతో, క్రమశిక్షణతో విధులు నిర్వహించాలని సూచించారు.ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్లలోని వివిధ రికార్డులు, పెండింగ్ కేసుల వివరాలు, దర్యాప్తు పురోగతి, స్టేషన్ నిర్వహణ, సిబ్బంది పనితీరు తదితర అంశాలను పరిశీలించారు.

స్టేషన్‌లోని క్రైమ్ రికార్డులు, కేసు డైరీలు,ఎఫ్‌ఐఆర్‌లు,పెండింగ్ కేసులు, వారెంట్లు,బీట్ వ్యవస్థ, రౌడీ షీట్లు, సీసీటీఎన్‌ఎస్ తదితర రికార్డులను ఎస్పీ పరిశీలించి,కేసుల దర్యాప్తును నాణ్యతతో, నిర్ణీత గడువులో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను సత్వరమే స్వీకరించి, చట్టపరమైన పరిష్కారం అందించడంతో పాటు బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.ప్రజలతో మరింత స్నేహపూర్వకంగా వ్యవహరిస్తూ పోలీస్ శాఖపై నమ్మకాన్ని పెంపొందించే విధంగా విధులు నిర్వహించాలని సిబ్బందికి సూచించారు.

అలాగే మహిళలు, చిన్నారుల భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని, షీ టీమ్స్, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ (AHTU) ద్వారా అవగాహన కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలని తెలిపారు.సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణా తదితర నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. పోలీస్ స్టేషన్ పరిసరాలు, రికార్డు గదులు, సిబ్బంది వసతి ప్రాంతాలు పరిశుభ్రంగా, క్రమబద్ధంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.విధి నిర్వహణలో క్రమశిక్షణ,అప్రమత్తత,ప్రజాసేవా దృక్పథంతో పనిచేయాలని సిబ్బందికి దిశానిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ,“ప్రజల భద్రతే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యం. ప్రతి పోలీస్ అధికారి,సిబ్బంది బాధ్యతాయుతంగా విధులు నిర్వహిస్తూ,ప్రజలకు అందుబాటులో ఉండాలి. నేరాల నియంత్రణతో పాటు బాధితులకు సత్వర న్యాయం అందేలా సమర్థవంతమైన పోలీసింగ్‌ అందించాలి”అని సూచించారు.

ఈ కార్యక్రమంలో ప్రోబేషనరి డీఎస్పీలు, జైనూర్ సీఐ రమేష్, సిర్పూర్-(యు) ఎస్ఐ కొమురయ్య, లింగాపూర్ ఎస్ఐ సురేష్ మరియు పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

Related News

Latest News