డీలిమిటేషన్ బిల్లుపై బీజేపీ హర్షం- అన్ని పార్టీలు మద్దతు తెలపాలని అమిత్‌ షా పిలుపు

ప్రతిపక్షం, నవంబర్ 28: డీలిమిటేషన్ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడంపై భారతీయ జనతా పార్టీ హర్షం వ్యక్తం చేసింది. మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామన్న హామీని అమలు చేసే దిశగా ఇది కీలక ముందడుగు అని పేర్కొంది. దేశ నిర్మాణంలో మహిళలకు మరింత ప్రాధాన్యం కల్పించేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుందని వెల్లడించింది. ఈ బిల్లుకు పార్లమెంట్‌లో అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. మహిళా సాధికారతకు సంబంధించిన ఈ చారిత్రాత్మక నిర్ణయానికి రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు సహకరించాలని కోరారు.

డీలిమిటేషన్ బిల్లును కేవలం చట్టపరమైన సంస్కరణగా మాత్రమే చూడకూడదని, దేశ పాలనా వ్యవస్థలో మహిళలకు సముచిత స్థానం కల్పించే నిర్ణయాత్మక అడుగుగా భావించాలని బీజేపీ పేర్కొంది. భారతీయ నారీశక్తికి ఇచ్చిన హామీని నెరవేర్చే సమయం ఆసన్నమైందని పార్టీ తన అధికారిక ఎక్స్ ఖాతాలో వెల్లడించింది. కేంద్ర కేబినెట్ ఈ బిల్లుకు ఆమోదం తెలపడం దేశ చరిత్రలో ఒక ముఖ్యమైన మైలురాయిగా అభివర్ణించింది. నియోజకవర్గాల పునర్విభజన ద్వారా లోక్‌సభలో రాష్ట్రాల ప్రాతినిధ్యం విస్తరించడంతో పాటు మహిళా రిజర్వేషన్ల అమలుకు మార్గం సుగమం అవుతుందని వివరించింది.

కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ఈ అంశంపై ఎక్స్ వేదికగా స్పందించారు. రాష్ట్రాల్లో లోక్‌సభ స్థానాలను 50 శాతం పెంచేందుకు ఉద్దేశించిన 132వ రాజ్యాంగ సవరణ బిల్లుకు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వాలని కోరారు. శుక్రవారం కేంద్ర కేబినెట్ ఈ బిల్లుకు ఆమోదం తెలపడంతో దేశంలోని మహిళల దశాబ్దాల నిరీక్షణకు ముగింపు పలికే దిశగా అడుగు పడిందని పేర్కొన్నారు. నారీశక్తి వందన్ చట్టం ద్వారా లోక్‌సభతో పాటు రాష్ట్ర శాసనసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే లక్ష్యం సాకారం కానుందని తెలిపారు. పాలనలో మహిళలను మరింత బలమైన భాగస్వాములుగా మార్చే ఈ ప్రయత్నానికి అన్ని పార్టీలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

బీజేపీ వెల్లడించిన వివరాల ప్రకారం.. ప్రతిపాదిత డీలిమిటేషన్ ప్రక్రియలో భాగంగా రాష్ట్రాల్లో లోక్‌సభ స్థానాలను 50 శాతం పెంచే అవకాశం ఉంది. దీనివల్ల పార్లమెంటులో ప్రజాప్రాతినిధ్యం మరింత విస్తృతమవుతుందని పార్టీ అభిప్రాయపడింది. అంతేకాకుండా 2029 లోక్‌సభ ఎన్నికల నాటికి మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు ఈ ప్రతిపాదనలు దోహదపడతాయని ఆశాభావం వ్యక్తం చేసింది. మహిళలకు రాజకీయాల్లో మరిన్ని అవకాశాలు కల్పించడంతో పాటు నిర్ణయాత్మక పదవుల్లో వారి భాగస్వామ్యాన్ని పెంచడమే ఈ చర్యల ప్రధాన ఉద్దేశమని బీజేపీ పేర్కొంది.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం మహిళా రిజర్వేషన్ల అంశంపై ఇప్పటికే తన వైఖరిని స్పష్టం చేశారు. లోక్‌సభ, రాష్ట్ర శాసనసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను తమ ప్రభుత్వం తప్పకుండా అమలు చేస్తుందని పేర్కొంటూ ఎక్స్ వేదికగా ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించే పార్టీలు కూడా మహిళలకు రిజర్వేషన్లు కల్పించే ప్రక్రియను అడ్డుకోలేవని ఆయన వ్యాఖ్యానించారు. ప్రధాని సందేశాన్ని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ తన ఎక్స్ ఖాతాలో పంచుకున్నారు. మహిళా సాధికారతకు మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొంటూ, దీనిని మోదీ గ్యారెంటీగా అభివర్ణించారు.

ఇదిలా ఉండగా, డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ల బిల్లులపై దేశవ్యాప్తంగా రాజకీయ చర్చలు కొనసాగుతున్నాయి. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య ఈ అంశాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు కొన్ని విపక్ష పార్టీలు కూడా తమ వైఖరిని వెల్లడిస్తూ బిల్లులకు మద్దతు ప్రకటిస్తున్నాయి. తమిళనాడుకు చెందిన డీఎంకే, తెలంగాణకు చెందిన బీఆర్ఎస్ నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ల బిల్లులకు మద్దతు ఇవ్వనున్నట్లు ప్రకటించినట్లు సమాచారం. మహారాష్ట్రలో శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ (శరద్‌చంద్ర పవార్) కూడా డీలిమిటేషన్‌తో అనుసంధానమైన మహిళా రిజర్వేషన్ల రాజ్యాంగ సవరణ బిల్లుకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు కథనాలు వెల్లడించాయి.

ఈ పరిణామాల నేపథ్యంలో పార్లమెంట్‌లో బిల్లుల ఆమోదంపై ఆసక్తి నెలకొంది. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న లక్ష్యానికి అన్ని పార్టీలు మద్దతు ఇవ్వాలని బీజేపీ నేతలు కోరుతున్నారు. అయితే నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ, రాష్ట్రాల మధ్య ప్రాతినిధ్య సమతుల్యత, మహిళా కోటా అమలు విధానం వంటి అంశాలపై రాజకీయంగా చర్చ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో అమిత్ షా చేసిన విజ్ఞప్తి ప్రాధాన్యం సంతరించుకుంది. పార్లమెంట్‌లో అన్ని పార్టీలు ఏకాభిప్రాయానికి వచ్చి బిల్లులకు మద్దతు ఇస్తాయా లేదా అన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది.

Related News

Latest News