రూ.3.50 లక్షలకే ఇందిరమ్మ ఫ్లాట్‌.. ఐదు ప్రాంతాల్లో 2,400 ఇళ్లు!

ప్రతిపక్షం, నవంబర్ 13: తెలంగాణలో సొంత ఇల్లు లేని పేద, అల్పాదాయ వర్గాల ప్రజలకు ప్రభుత్వం శుభవార్త అందించింది. ఇందిరమ్మ ఇళ్ల టవర్స్‌ పథకంలో భాగంగా రాష్ట్రంలోని మున్సిపల్‌ కార్పొరేషన్ల పరిధిలో నిర్మించే ఫ్లాట్లను అర్హులైన లబ్ధిదారులకు కేవలం రూ.3.50 లక్షలకే అందించాలని నిర్ణయించింది. అయితే కోర్‌ అర్బన్‌ రీజియన్‌ పరిధిలోని హైదరాబాద్‌కు ఈ ధర నిర్ణయం వర్తించదు. మిగతా మున్సిపల్‌ కార్పొరేషన్లలో నిర్మించే ఫ్లాట్లకు ఈ విధానాన్ని అమలు చేయనున్నారు. లబ్ధిదారులపై ఒకేసారి ఆర్థిక భారం పడకుండా మొత్తం మొత్తాన్ని నాలుగు విడతల్లో చెల్లించేలా అధికారులు ప్రణాళిక రూపొందించారు.

ఫ్లాట్‌ కేటాయింపు సమయంలో రూ.లక్ష చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఆర్‌సీసీ నిర్మాణం పూర్తయ్యే దశలో మరో రూ.లక్ష, ఫినిషింగ్‌ పనులు చేపట్టే సమయంలో ఇంకో రూ.లక్ష చెల్లించాలి. మిగిలిన రూ.50 వేల మొత్తాన్ని ఫ్లాట్‌ కేటాయించే సమయంలో చెల్లించాల్సి ఉంటుంది. ఈ విధంగా మొత్తం రూ.3.50 లక్షలను విడతలవారీగా చెల్లించే అవకాశం కల్పిస్తున్నారు. ప్రభుత్వం ఒక్కో ఫ్లాట్‌పై రూ.5 లక్షల సబ్సిడీ అందించడంతో పాటు, అన్‌డివైడెడ్‌ షేర్‌ కింద స్థలాన్ని ఉచితంగా కేటాయించనుంది. ఒక్కో ఫ్లాట్‌ను 512 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించనున్నారు.

మొదటి విడతలో ఐదు ప్రాంతాల్లో మొత్తం 2,400 ఫ్లాట్ల నిర్మాణానికి రాష్ట్ర గృహనిర్మాణ శాఖ ప్రకటన విడుదల చేసింది. ఒక్కో ప్రాంతంలో 480 ఫ్లాట్ల చొప్పున నిర్మించనున్నారు. గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని గీసుకొండ మండలం గొర్రెకుంట, కాజీపేట మండలం మడికొండలో ఈ నిర్మాణాలు చేపట్టనున్నారు. నిజామాబాద్‌ జిల్లా నాగారం పరిధిలోని ఆర్‌జీకే కాలనీ, నల్గొండ జిల్లాలోని మామిళ్లగూడ పరిధిలో ఉన్న డీవీకే రోడ్డు, మహబూబ్‌నగర్‌ జిల్లాలోని బండమీదిపల్లిలోనూ ఇందిరమ్మ టవర్స్‌ నిర్మించనున్నారు. ఈ ఐదు ప్రాంతాల్లో త్వరలోనే నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయాలని అధికారులు భావిస్తున్నారు.

ఇందిరమ్మ ఫ్లాట్ల కోసం దరఖాస్తు చేసుకునే విధానంలోనూ ప్రభుత్వం కొన్ని నిబంధనలు రూపొందించింది. గతంలో హైదరాబాద్‌ పరిధిలో ఎదురైన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని జిల్లాల్లో అమలు చేసే విధానంలో మార్పులు చేసినట్లు తెలుస్తోంది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు నమోదు చేసే సమయంలో ఆధార్‌ కార్డు నంబరు నమోదు చేస్తే సరిపోతుంది. మున్సిపల్‌ కార్పొరేషన్‌ను ఒక యూనిట్‌గా తీసుకుని దరఖాస్తులను స్వీకరిస్తారు. సంబంధిత కార్పొరేషన్‌ పరిధిలో నివాసం ఉంటున్న అల్పాదాయ వర్గాలకు చెందిన వారు ఇందిరమ్మ ఫ్లాట్‌ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుదారులు మీ సేవా కేంద్రాల ద్వారా రూ.100 రుసుము చెల్లించి తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది.

దరఖాస్తు సమయంలో టోకెన్‌ అడ్వాన్స్‌ కింద రూ.10 వేలు చెల్లించాలి. అయితే ఫ్లాట్‌ కేటాయింపు జరగని వారికి ఈ మొత్తాన్ని తిరిగి చెల్లించనున్నారు. అర్హతల విషయానికి వస్తే, దరఖాస్తుదారుడికి సంబంధిత మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో ఎక్కడా సొంత ఇల్లు లేదా ఇంటి స్థలం ఉండకూడదు. కుటుంబ వార్షిక ఆదాయం రూ.6 లక్షల్లోపు ఉండాలి. ఈ అర్హతలు ఉన్నవారినే పథకానికి పరిగణనలోకి తీసుకుంటారు. లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత ఉండేలా 360 డిగ్రీల కోణంలో విచారణ చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. మొదట దరఖాస్తులను పరిశీలించి అర్హులైన వారిని గుర్తిస్తారు. అనంతరం లాటరీ విధానంలో ఫ్లాట్లను కేటాయిస్తారు. లాటరీలో ఎంపికైన వారి వివరాలను క్షేత్రస్థాయిలో మరోసారి పరిశీలించి అర్హతలను నిర్ధారించనున్నారు.

ఫ్లాట్‌ కేటాయించిన తర్వాత కూడా కొన్ని పరిమితులు విధించనున్నారు. లబ్ధిదారులు తమకు కేటాయించిన ఫ్లాట్‌ను పదేళ్ల వరకు విక్రయించడానికి అనుమతి ఉండదు. అలాగే ఇతరులకు అద్దెకు ఇవ్వడానికి కూడా వీలుండదు. అయితే అవసరమైతే బ్యాంకుల ద్వారా రుణం పొందేందుకు అవకాశం కల్పించనున్నారు. పథకానికి సంబంధించిన దరఖాస్తులు, అర్హతలు, చెల్లింపులు, ఇతర సందేహాలపై వివరాలు తెలుసుకోవాలనుకునే వారు 040-24603572 నంబరులో ఏర్పాటు చేసిన కాల్‌సెంటర్‌ను సంప్రదించవచ్చు.

మొదటి విడతలో ఐదు ప్రాంతాల్లో నిర్మించే 2,400 ఫ్లాట్ల కేటాయింపు ప్రక్రియ పూర్తయిన తర్వాత రాష్ట్రంలోని ఇతర మున్సిపల్‌ కార్పొరేషన్లలోనూ ఇందిరమ్మ టవర్స్‌ నిర్మాణాన్ని విస్తరించాలని ప్రభుత్వం యోచిస్తోంది. కరీంనగర్‌, భద్రాద్రి కొత్తగూడెం, మంచిర్యాల తదితర ప్రాంతాల్లో హౌసింగ్‌ బోర్డుకు అందుబాటులో ఉన్న స్థలాల వివరాలను అధికారులు ఇప్పటికే సేకరించినట్లు సమాచారం. ఆయా ప్రాంతాల్లో కూడా పేదలకు ఫ్లాట్లు అందించేలా తదుపరి కార్యాచరణ రూపొందించనున్నారు.

ఇదే సమయంలో కోర్‌ అర్బన్‌ రీజియన్‌ పరిధిలోని నాలుగు నియోజకవర్గాల్లో ఆటో డ్రైవర్ల కోసం ప్రత్యేకంగా మరో 4 వేల ఫ్లాట్లను నిర్మించే ప్రతిపాదనపై కూడా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందుకు సంబంధించిన నిబంధనలు, అర్హతలు, కేటాయింపు విధానాన్ని రూపొందిస్తున్నారు. మొత్తంగా రాబోయే రెండేళ్లలో ఇందిరమ్మ టవర్స్‌ పథకాన్ని మరిన్ని ప్రాంతాలకు విస్తరించి, సొంత ఇల్లు లేని పేదలకు అందుబాటు ధరలో నివాస వసతి కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది.

Related News

Latest News