వ్యవసాయానికి కనీసం 6 గంటల కరెంటు కూడా ఇవ్వడం లేదు
సీపీఎం నేతలు కాముని గోపాలస్వామి, రాళ్లబండి శశిధర్ విమర్శ
సిద్ధిపేట విద్యుత్ డీఈ కార్యాలయం ఎదుట ధర్నా
ప్రతిపక్షం ప్రతినిధి, సిద్ధిపేట, అక్టోబరు 22: ఎన్నికలకు ముందు 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం, ఇప్పుడు వ్యవసాయానికి రోజుకు ఆరు నుంచి ఎనిమిది గంటలు కూడా సక్రమంగా విద్యుత్ సరఫరా చేయడం లేదని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కాముని గోపాలస్వామి, రాళ్లబండి శశిధర్ విమర్శించారు. విద్యుత్ కోతలు, వర్షాభావ పరిస్థితులతో పంటలు ఎండిపోయి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయానికి నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ అందించాలని డిమాండ్ చేస్తూ గురువారం సిద్దిపేట విద్యుత్ శాఖ డీఈ కార్యాలయం ఎదుట సీపీఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం అధికారికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అప్పులు చేసి పెట్టుబడులు పెట్టిన రైతులు పంటలు చేతికందక దిక్కుతోచని స్థితిలో ఉన్నారని తెలిపారు. విద్యుత్ సరఫరాలో అంతరాయాలు, నాణ్యత లోపాల కారణంగా పంటలు ఎండిపోవడంతో పాటు బోర్లు, బావుల మోటార్లు కాలిపోతున్నాయని పేర్కొన్నారు.
దీంతో రైతులపై మరింత ఆర్థిక భారం పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. చుట్టూ రిజర్వాయర్లు ఉన్న సిద్ధిపేట జిల్లాలోనూ పంటలకు సక్రమంగా సాగునీరు అందడం లేదని అన్నారు. ప్రాజెక్టుల పేరుతో రాజకీయాలు చేయడం తప్ప రైతులను ఆదుకోవాలనే చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేదని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వ్యవసాయానికి నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. మిగిలిన పంటలైనా ఎండిపోకుండా సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ కోరారు. రైతుల సమస్యలను పరిష్కరించక పోతే రైతులు, ప్రజలను సమీకరించి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ ధర్నాలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు చొప్పరి రవికుమార్, జాలిగపు శిరీష, దాసరి ప్రశాంత్, సీపీఎం రూరల్ మండల కార్యదర్శి మామిడాల కనకయ్య, నాయకులు ఆముదాల రంజిత్‌రెడ్డి, కొండం సంజీవ్, బత్తుల అభిషేక్ భాను తదితరులు పాల్గొన్నారు.






























