- ఆర్టీఐ అమలులో నల్లగొండకు ఉత్తమ అవార్డు – కలెక్టర్ కు సన్మానం.
- ప్రజల సంక్షేమం కోసమే సమాచారం వాడాలి – జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్
- విద్యార్థులు ఆర్టీఐ పై అవగాహన కలిగి ఉండాలి.
- ఆర్టీఐ ఒక ఆయుధం లాంటిది – సమాచార కమిషనర్ దేశాల భూపాల్
ప్రతి పక్షం నల్గొండ నవంబర్ 29: సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) అత్యంత శక్తివంతమైన చట్టమని, ప్రతి ఒక్కరూ ఈ చట్టంపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అన్నారు.సమాచారం పొందేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని, సమాచారం వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాకుండా ప్రజల సంక్షేమం, దేశ అభివృద్ధి కోసం ఉపయోగపడాలని, ఇతరులను ఇబ్బందులకు గురిచేసే ఉద్దేశంతో వినియోగించకూడదని అన్నారు.
శనివారం టీఎన్జీవో భవన్లో సమాచార హక్కు వికాస సమితి ఆధ్వర్యంలో సమాచార హక్కు చట్టం-2005 పై నిర్వహించిన అవగాహన సదస్సుకు జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్, సమాచార కమిషనర్ దేశాల భూపాల్, తెలంగాణ రాష్ట్ర పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ సభ్యులు వర్రె వెంకటేశ్వర్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
- విద్యార్థులకు తప్పనిసరి అవగాహన:
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సమాచార హక్కు చట్టంపై విద్యార్థులు తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలని, ఇది ప్రజలకు ఎంతో ఉపయోగపడే చట్టమని తెలిపారు.
- *నల్లగొండకు ఉత్తమ అవార్డు:
నల్లగొండ జిల్లాకు సమాచార హక్కు చట్టం అమలులో ఉత్తమ అవార్డు రావడం జిల్లా అధికారుల సమిష్టి కృషి, సహకారం వల్లే సాధ్యమైందని అన్నారు. జిల్లా యంత్రాంగంలోని ప్రతి ఒక్కరి సహకారంతోనే ఈ గుర్తింపు లభించిందని అన్నారు.ప్రభుత్వ పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించేందుకు సమాచార హక్కు చట్టం కీలక పాత్ర పోషిస్తుందని కలెక్టర్ తెలిపారు.
జిల్లాలో సెక్షన్ 4 (1) (బి) ప్రకారం ప్రభుత్వ కార్యాలయాలు, ఉద్యోగులు అందించాల్సిన సమాచారాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచడం ఎంతో ముఖ్యమన్నారు. ఈ అంశంలో నల్లగొండ జిల్లాకు గుర్తింపు రావడం అభినందనీయమని తెలిపారు.
ప్రభుత్వ, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో అధికారులు నిరంతరం నిమగ్నమై ఉండటం వల్ల కొంత సమాచారం అందించడంలో జాప్యం జరుగుతోందని, ఈ లోపాలను సరిదిద్దేందుకు త్వరలో ఆర్టీఐ మానిటరింగ్ సమావేశం నిర్వహిస్తామని కలెక్టర్ వెల్లడించారు. ఉద్యోగుల విధి నిర్వహణకు సంబంధించిన లేదా వ్యక్తిగత అంశాలపై ఏవైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు.
రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్ దేశాల భూపాల్ మాట్లాడుతూ తాను రాష్ట్రంలోని 23 జిల్లాల్లో పర్యటించి సుమారు 450 సమావేశాలు నిర్వహించినట్లు తెలిపారు.నల్లగొండ జిల్లాలో సెక్షన్ 4 (1) (బి) కింద సమాచారాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచేందుకు కలెక్టర్ తీసుకున్న చర్యలు ప్రశంసనీయమన్నారు. ఈ కృషి వల్లే రాష్ట్ర స్థాయిలో ఉత్తమ కలెక్టర్ అవార్డు సాధించారని అభినందించారు.
- ఆర్టీఐ ఒక ఆయుధం:*
ఆర్టీఐ చట్టం ఒక ఆయుధం లాంటిదని, విద్యార్థులు దేశానికి సంపద వంటివారని దేశాల భూపాల్ అన్నారు. విద్యార్థులు సమాచార హక్కు చట్టాన్ని తెలుసుకొని భవిష్యత్తులో కలెక్టర్లు, న్యాయవాదులు, పోలీసు అధికారులు వంటి ఉన్నత పదవులకు ఎదగాలని ఆకాంక్షించారు.
ఆర్టీఐ కార్యకర్తలు తమ సామాజిక బాధ్యతను నిర్వర్తిస్తూ చట్టంలోని అంశాలను ప్రజలకు చేరవేయాలని, ప్రజల పక్షాన నిలబడి సమాజాన్ని చైతన్యవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమాచార హక్కు చట్టంపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంపొందించుకొని, పారదర్శకమైన పాలనకు సహకరించాలని అన్నారు.
- అవినీతి నిర్మూలనకు ఆర్టీఐ:
తెలంగాణ రాష్ట్ర పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ సభ్యులు వర్రె వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం అమలులో ఉత్తమ అవార్డు పొందిన కలెక్టర్ ను అభినందించారు. అవినీతిని నిర్మూలించేందుకు, ప్రభుత్వ పరిపాలనలో పారదర్శకతను పెంచేందుకు ఆర్టీఐ చట్టం తీసుకువచ్చారని తెలిపారు.
ప్రభుత్వ అధికారులు ప్రజలకు జవాబుదారీగా ఉండేలా ఈ చట్టం పనిచేస్తుందని తెలిపారు. సామాన్య ప్రజల చేతిలో శక్తివంతమైన ఆయుధంగా సమాచార హక్కు చట్టం నిలుస్తుందని, దేశంలోని 140 కోట్ల ప్రజలకు పరిపాలనపై ప్రశ్నించే హక్కు, సమాచారం తెలుసుకునే హక్కు కల్పిస్తుందని అన్నారు.
ప్రభుత్వ అధికారులు చేసే తప్పులు, అవినీతి చర్యలను వెలుగులోకి తీసుకురావడానికి ఈ చట్టం ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రజలందరికీ ఆర్టీఐపై అవగాహన కల్పించాలని కలెక్టర్‌ను కోరారు.
ప్రజలను ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములను చేస్తే మరింత మెరుగైన ఫలితాలు సాధించవచ్చని వర్రె వెంకటేశ్వర్లు అన్నారు. సమాచార హక్కు చట్టంతో పాటు మానవ హక్కుల కమిషన్, మహిళా హక్కుల కమిషన్, ఎస్సీ, ఎస్టీ హక్కులకు సంబంధించిన కమిషన్లను ప్రభుత్వం నియమించిందని తెలిపారు.
- కలెక్టర్ కు సన్మానం:
అనంతరం జిల్లా కలెక్టర్ ను ఆర్.టి.ఐ ఉత్తమ అవార్డు సాధించినందుకు సన్మానించారు.ఈ సమావేశంలో సభాధ్యక్షులు ఎర మాద కృష్ణారెడ్డి, రాష్ట్ర మహిళా కమిటీ అధ్యక్షురాలు వై. హేమలత, సభ్యురాలు గోపగాని మాధవి, గాద వినోద్ రెడ్డి, మాజీ గ్రంథాలయ చైర్మన్ చింత ముత్యాలరావు, సభ్యులు, సమాచార హక్కు వికాస సమితి కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు.



























