‘చలో పార్లమెంట్‌’తో ఢిల్లీలో ఉద్రిక్తత.. కాక్రోచ్‌ పార్టీ కార్యకర్తలపై లాఠీచార్జ్‌

ప్రతిపక్షం, జూలై 20: పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల తొలి రోజే దేశ రాజధాని ఢిల్లీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాక్రోచ్‌ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘చలో పార్లమెంట్‌’ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలిరావడంతో జంతర్‌మంతర్‌ పరిసరాల్లో ఉద్రిక్తత ఏర్పడింది. పార్లమెంట్‌ వైపు వెళ్లేందుకు నిరసనకారులు ప్రయత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకుని లాఠీచార్జ్‌ చేసినట్లు సమాచారం.

నిరసన కార్యక్రమానికి అనుమతి లేదని పోలీసులు ముందుగానే స్పష్టం చేసినప్పటికీ, సుమారు 8 వేల మంది వరకు జంతర్‌మంతర్‌ వద్దకు చేరుకున్నట్లు అధికారులు అంచనా వేశారు. దీంతో ఆ ప్రాంతంలో భారీగా పోలీసు బలగాలను మోహరించి, రహదారులపై బారికేడ్లు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్‌ ఆంక్షలు విధించి పరిస్థితిని అదుపులో ఉంచేందుకు చర్యలు చేపట్టారు.

నిరసనకారులు పార్లమెంట్‌ వైపు వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుని పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జ్‌ చేసినట్లు తెలుస్తోంది.

ముందస్తు జాగ్రత్తగా అల్లర్ల నియంత్రణ వాహనాలు, వాటర్‌ కేనన్లు, శీఘ్ర స్పందన బృందాలను పోలీసులు సిద్ధంగా ఉంచారు. ఢిల్లీలో భారతీయ నాగరిక సురక్ష సంహితలోని సెక్షన్‌ 163 కింద నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నాయని పోలీసులు తెలిపారు. అనుమతి లేకుండా భారీగా ప్రజలు గుమికూడడం, ర్యాలీలు, నిరసనలు నిర్వహించడం నిషేధమని స్పష్టం చేశారు.

పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. పార్లమెంట్‌ భవనం, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, కీలక కూడళ్ల వద్ద భారీగా బలగాలను మోహరించారు. సీసీటీవీ కెమెరాలు, డ్రోన్‌ నిఘా, ప్రత్యేక భద్రతా బృందాల ద్వారా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.

ప్రస్తుతం ఢిల్లీలో పరిస్థితి అదుపులోనే ఉందని పోలీసులు తెలిపారు. ప్రజలు వదంతులను నమ్మవద్దని, శాంతిభద్రతలకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

Spread the love

Related News

Latest News