ప్రతిపక్షం, సెప్టెంబర్ 19: తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గిలో ఆదివారం ‘పాంచజన్య సంకల్ప సభ’ నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 20న మధ్యాహ్నం 2.30 గంటలకు కోస్గి కాలేజీ మైదానంలో ఈ సభ ప్రారంభం కానుంది. పార్టీ అధినేత కల్వకుంట్ల కవిత ఈ సభకు హాజరై బహుజన తెలంగాణ సాధనకు సంబంధించిన తమ కార్యాచరణ, భవిష్యత్ ప్రణాళికను ప్రకటించనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
సబ్బండ వర్గాలు, సకల జనుల వికాసం, సాధికారత లక్ష్యంగా బహుజన తెలంగాణ నిర్మాణానికి సంబంధించిన బ్లూప్రింట్‌ను సభ వేదికగా ప్రకటించనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో అన్ని వర్గాలకు సమానంగా అభివృద్ధి ఫలాలు అందేలా రాజకీయ కార్యాచరణ రూపొందించాల్సిన అవసరం ఉందనే అంశాన్ని సభలో ప్రధానంగా ప్రస్తావించనున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.
తెలంగాణ రక్షణ సేన పార్టీ ఏర్పాటు తర్వాత ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో కవిత పర్యటించడం ఇది రెండోసారి అని పార్టీ నాయకులు తెలిపారు. గత మే 8న షాద్‌నగర్ సమీపంలోని చౌదరిగూడెంలో పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు సాధన కోసం సభ నిర్వహించిన కవిత.. తాజాగా కొడంగల్ వేదికగా మరో భారీ కార్యక్రమానికి హాజరవుతున్నారు. ఈ ప్రాంతంలో కృష్ణా జలాల అంశం, పాలమూరు ప్రాంత అభివృద్ధి, సాగునీటి హక్కులు వంటి అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన అనంతరం తెలంగాణకు కృష్ణా జలాల్లో జరుగుతున్న అన్యాయంపై కవిత పలుమార్లు గళం వినిపించారని పార్టీ నాయకులు గుర్తుచేస్తున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాకు సాగునీటి విషయంలో తగిన ప్రాధాన్యం దక్కాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొంటూ వస్తున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో కోస్గి సభలో కూడా కృష్ణా జలాలు, పాలమూరు ప్రాంత ప్రయోజనాలు, తెలంగాణ హక్కులకు సంబంధించిన అంశాలపై కవిత మాట్లాడనున్నట్లు వెల్లడించారు.
జోగులాంబ అమ్మవారి ఆశీస్సులతో రాజకీయంగా తొలి అడుగు వేసిన కవిత.. ఇప్పుడు బహుజన తెలంగాణ సాధన లక్ష్యంగా ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గమైన కొడంగల్‌ను సభకు వేదికగా ఎంచుకోవడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. కోస్గి కాలేజీ మైదానంలో జరగనున్న ఈ సభకు పెద్ద సంఖ్యలో ప్రజలు, పార్టీ కార్యకర్తలు, నాయకులు హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఉమ్మడి పాలమూరు జిల్లా కీలక పాత్ర పోషించిందని పార్టీ నాయకులు గుర్తుచేస్తున్నారు. 2009లో తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సమయంలో పాలమూరు గడ్డ నుంచి ఉద్యమానికి మద్దతుగా ప్రజలను సమీకరించేందుకు కవిత పర్యటించారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రజలు ఉద్యమ నాయకత్వాన్ని ఆశీర్వదించి ఢిల్లీకి పంపించారని, అనంతరం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
అయితే రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా సబ్బండ వర్గాలు, సకల జనులకు ఆశించిన స్థాయిలో అభివృద్ధి ఫలాలు అందలేదని తెలంగాణ రక్షణ సేన వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఆర్థిక అసమానతలు పెరిగాయని, సామాజికంగా వెనుకబడిన వర్గాలకు మరింత సాధికారత అవసరమని పేర్కొంటున్నాయి. బహుజన తెలంగాణ సాధన ద్వారా అన్ని వర్గాలకు అభివృద్ధి, అవకాశాలు, రాజకీయ ప్రాతినిధ్యం అందించాలన్న లక్ష్యంతో కవిత ముందుకు సాగుతున్నారని పార్టీ నాయకులు చెబుతున్నారు.
మరోవైపు కృష్ణా జలాల విషయంలో తెలంగాణ ప్రయోజనాలను కాపాడాల్సిన అవసరం ఉందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఉమ్మడి పాలమూరు జిల్లాలో సాగునీటి సమస్యలు, ప్రాజెక్టుల అంశం, రైతుల ప్రయోజనాలు, ప్రాంతీయ అభివృద్ధి వంటి అంశాలను సభలో ప్రస్తావించే అవకాశం ఉందని చెబుతున్నారు. ముఖ్యంగా పాలమూరు ప్రాంతం నుంచి రాష్ట్ర రాజకీయాల్లో నాయకత్వం కొనసాగుతున్నప్పటికీ ఈ ప్రాంతానికి ఆశించిన స్థాయిలో ప్రయోజనం దక్కలేదనే అంశాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు.
ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలోనే పాంచజన్య సంకల్ప సభను నిర్వహించడం ద్వారా తమ రాజకీయ, సామాజిక కార్యాచరణను ప్రజలకు వివరించేందుకు తెలంగాణ రక్షణ సేన సిద్ధమవుతోంది. బహుజన తెలంగాణ లక్ష్యాలు, సబ్బండ వర్గాల సాధికారత, పాలమూరు ప్రాంత అభివృద్ధి, కృష్ణా జలాల హక్కులు తదితర అంశాలపై కవిత ఏం ప్రకటిస్తారన్న దానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.





























