ధైర్యం ఉంటే నా సవాల్‌ను స్వీకరించండి హరీశ్ రావు, మాజీ మంత్రి
ప్రతిపక్షం ప్రతినిధి, సిద్ధిపేట, సెప్టెంబర్ 18: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యల నుంచి దృష్టిని మళ్లించేందుకు రాజకీయాలు చేస్తోందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ శాసనసభా పక్ష ఉపనేత తన్నీరు హరీశ్ రావు ఆరోపించారు. తన వ్యవసాయ భూమి వద్దకు కాంగ్రెస్ ఎంపీల బృందం రావడం కూడా దీనిలో భాగమేనని విమర్శించారు. సిద్ధిపేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
22ఏ భూముల సమస్యను పరిష్కరించాలి
22ఏ నిషేధిత జాబితాలో పెద్ద సంఖ్యలో భూములు ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు.భూముల రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడంతో రైతులు, సామాన్యులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. భూములను విక్రయించలేకపోతున్నారని అన్నారు. అవసరాలకు రుణాలు పొందలేక పోతున్నారని పేర్కొన్నారు.
ఈ సమస్యను పరిష్కరించాల్సిన ప్రభుత్వం తమపై ఎదురుదాడి చేస్తోందని విమర్శించారు. 22ఏ అంశంపై బీఆర్‌ఎస్ చేసిన విమర్శలకు ప్రభుత్వం సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
నా భూమిలో ఫామ్ హౌస్ లేదు
తన వ్యవసాయ భూమిపై వస్తున్న ఆరోపణలను హరీశ్ రావు ఖండించారు.తన భూమిలో విలాసవంతమైన ఫామ్ హౌస్ లేదన్నారు.కనీసం బాత్రూం కూడా లేదని చెప్పారు.తాను వ్యవసాయ భూమిని విడతల వారీగా కొనుగోలు చేశానని తెలిపారు.భూమి కొనుగోలుకు సంబంధించిన పత్రాలు తన వద్ద ఉన్నాయని చెప్పారు.రెవెన్యూ అధికారుల ద్వారా సర్వే చేయించుకున్నానని తెలిపారు. రిజిస్ట్రేషన్‌లో 13 ఎకరాల 12 గుంటలు ఉన్నప్పటికీ, సర్వే అనంతరం 13 ఎకరాల 10 గుంటలే తన స్వాధీనంలో ఉన్నట్లు తేలిందన్నారు.తన భూమి కొనుగోలులో ఒక్క చిన్న తప్పు ఉన్నట్లు నిరూపించినా మొత్తం భూమిని ప్రభుత్వానికి రాసి ఇవ్వడానికి సిద్ధమని స్పష్టం చేశారు.
ఎంపీలకు సమస్యలు చూపిస్తా
సిద్ధిపేటకు వచ్చిన కాంగ్రెస్ ఎంపీలను అతిథులుగా స్వాగతించామని హరీశ్ రావు అన్నారు. తన వ్యవసాయ భూమిని స్వయంగా చూపించేందుకు సిద్ధమని చెప్పారు.అదే సమయంలో 22ఏ బాధితుల సమస్యలను కూడా వారికి చూపించాలని భావించానన్నారు. సిద్ధిపేటలోని పలు ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు 22ఏ జాబితాలో ఉన్నాయని పేర్కొన్నారు. వాటివల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఎంపీలకు వివరించాలని అనుకున్నానని అన్నారు.
సిద్ధిపేటలో అసంపూర్తిగా ఉన్న అభివృద్ధి పనులను కూడా ఎంపీలకు చూపించాలని భావించానని హరీశ్ రావు తెలిపారు. వెయ్యి పడకల ఆసుపత్రి పనులు, నర్సింగ్ కళాశాల పనులు పెండింగ్‌లో ఉన్నాయని అన్నారు. రంగనాయక సాగర్ వద్ద నిలిచి పోయిన పర్యాటక ప్రాజెక్టును కూడా చూపించాలని అనుకున్నానన్నారు.
రోడ్ల దుస్థితిని కూడా ఎంపీల దృష్టికి తీసుకెళ్లాలని భావించానని చెప్పారు.
హామీలను అమలు చేయండ
రైతులకు విద్యుత్, సాగు నీరు, రుణ మాఫీ వంటి అంశాల్లో ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. సిద్ధిపేటలో పలువురు రైతులకు రుణమాఫీ ఇంకా జరగలేదని ఆయన ఆరోపించారు. ఆటో డ్రైవర్లు, మహిళలకు ఇచ్చిన హామీలను కూడా ప్రభుత్వం అమలు చేయాలని కోరారు.
భారీ పోలీసుల మోహరింపు ఎందుకు
కాంగ్రెస్ ఎంపీల పర్యటన సందర్భంగా భారీగా పోలీసులను మోహరించారని హరీశ్ రావు విమర్శించారు.
డ్రోన్ కెమెరాలు, బుల్లెట్ ప్రూఫ్ వాహనాలతో భారీ బందోబస్తు ఎందుకని ప్రశ్నించారు. ప్రజా ధనం, ప్రభుత్వ యంత్రాంగ సమయం వృథా అవుతోందని ఆరోపించారు.
రాష్ట్ర హక్కుల కోసం పోరాడాలి
కాంగ్రెస్ ఎంపీలు రాష్ట్ర సమస్యలపై కేంద్రంతో పోరాడాలని హరీశ్ రావు అన్నారు. తెలంగాణకు రావాల్సిన సాగునీటి ప్రాజెక్టులు, అనుమతులు, రీజినల్ రింగ్ రోడ్డు, మెట్రో వంటి అంశాలపై కేంద్రాన్ని నిలదీయాలని కోరారు.రాష్ట్ర హక్కుల కోసం కలిసి పోరాడాలని సూచించారు.రాజకీయ కక్ష సాధింపుల కోసం యాత్రలు చేయడం సరికాదని అన్నారు.
దళితుల భూములపై సవాల్
కేసీఆర్ దళితుల భూములను కబ్జా చేశారంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలను హరీశ్ రావు ఖండించారు.
ఆ ఆరోపణలు తప్పని తేలితే సీఎం, మంత్రులు రాజీనామా చేయడానికి సిద్ధమా అని ప్రశ్నించారు.అదే విధంగా తమ ఆరోపణలు తప్పని తేలితే తాము కూడా రాజీనామాకు సిద్ధమని సవాల్ చేశారు.
రాజకీయ కక్షసాధింపు వద్దు
ప్రజా సమస్యలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని హరీశ్ రావు కోరారు. డైవర్షన్ రాజకీయాలతో సమస్యలు పరిష్కారం కావని అన్నారు.22ఏ భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. రెవెన్యూ వ్యవస్థపై నమ్మకం ఉంచాలని సూచించారు.ప్రజా సమస్యలపై తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.రాష్ట్ర హక్కులు, రైతుల సమస్యలు, ప్రజా సమస్యలపై బీఆర్‌ఎస్ తరఫున ప్రశ్నిస్తూనే ఉంటామని హరీశ్ రావు తెలిపారు.





























