కృతి సనన్ డ్రెస్‌పై కంగన విమర్శలు.. పాత ఫొటోలతో నెటిజన్ల కౌంటర్

ప్రతిపక్షం, ఆగస్టు 27: రాఖీ పండుగ సందర్భంగా కృతి సనన్ నటించిన ఓ ప్రకటనలో ఆమె ధరించిన దుస్తులపై నటి, ఎంపీ కంగన రనౌత్ చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో చర్చకు దారితీశాయి. కృతి సనన్ దుస్తుల విషయంలో కంగన అభ్యంతరం వ్యక్తం చేయడంతో తాజాగా నెటిజన్లు ఆమె గతంలో ధరించిన దుస్తులకు సంబంధించిన ఫొటోలను వెలుగులోకి తీసుకొచ్చారు.

2015లో జాతీయ చలనచిత్ర పురస్కారం అందుకున్న సమయంలో కంగన రనౌత్ ధరించిన దుస్తులకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా అవార్డు అందుకున్న సమయంలో కంగన ఆఫ్‌-షోల్డర్ దుస్తులు ధరించారని పలువురు నెటిజన్లు గుర్తుచేస్తున్నారు.

రాష్ట్రపతి భవన్‌లో జరిగిన అవార్డు ప్రదానోత్సవం కూడా ఒక అధికారిక, సాంస్కృతిక కార్యక్రమమేనని పేర్కొంటూ నెటిజన్లు కంగనపై ప్రశ్నలు సంధిస్తున్నారు. ఇతరుల దుస్తులపై విమర్శలు చేసే ముందు గతంలో తాము ఎలా వ్యవహరించామో కూడా ఒకసారి ఆలోచించుకోవాలని వ్యాఖ్యానిస్తున్నారు.

మరోవైపు జాతీయ పురస్కారం అందుకునే సమయంలో కృతి సనన్ సంప్రదాయబద్ధంగా చీర ధరించారని కొందరు నెటిజన్లు గుర్తుచేస్తున్నారు. దీంతో కృతి సనన్‌-కంగన మధ్య నేరుగా వివాదం లేకపోయినా.. ఇద్దరు నటీమణుల దుస్తులపై సామాజిక మాధ్యమాల్లో చర్చ జరుగుతోంది.

కంగన వ్యాఖ్యలను సమర్థిస్తున్న వారు కూడా ఉండగా, మరికొందరు మాత్రం దుస్తుల విషయంలో వ్యక్తిగత స్వేచ్ఛను గౌరవించాలని అంటున్నారు. దీంతో రాఖీ ప్రకటనతో మొదలైన ఈ అంశం ఇప్పుడు పాత ఫొటోల కారణంగా మరోసారి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

Spread the love

Related News

Latest News