హైదరాబాద్, ప్రతిపక్షం, జూన్ 09: సమాజంలో నిజమైన మార్పు వచ్చినప్పుడే విప్లవకారుడు సుద్దాల హనుమంతు కలలు కన్న సమాజం నిర్మాణం సాధ్యమవుతుందని ప్రముఖ గేయరచయిత సుద్దాల అశోక్ తేజ అన్నారు. సుద్దాల హనుమంతు 115వ జయంతి సందర్భంగా తెలంగాణ సాహిత్య అకాడమీ, తెలంగాణ సాహితి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సు, కవి సమ్మేళనంలో ఆయన మాట్లాడారు.
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో సుద్దాల హనుమంతు కీలక పాత్ర పోషించారని, నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా గన్నుతో, పెన్నుతో పోరాడిన మహోన్నత విప్లవకారుడని కొనియాడారు. ఆయన ఆశయాలను నేటి తరానికి చేరవేయాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రస్తుత సమాజంలో అవినీతి, నిరుద్యోగం, ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేసిన అశోక్ తేజ, సామాజిక చైతన్యం కలిగించే సాహిత్యం మరింత అవసరమైందన్నారు. సుద్దాల హనుమంతు రచనలు ప్రజల్లో పోరాట స్ఫూర్తిని నింపాయని గుర్తుచేశారు.
ఈ కార్యక్రమంలో పలువురు సాహితీవేత్తలు, కవులు పాల్గొని సుద్దాల హనుమంతు సాహిత్య వారసత్వాన్ని స్మరించుకున్నారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.

















