కేసీఆర్ పాలనలో సాగునీటి వ్యవస్థ దెబ్బతింది.. ప్రాజెక్టుల పేరుతో లక్షల కోట్లు ఖర్చు చేశారు: మంత్రి ఉత్తమ్

ప్రతిపక్షం, జూలై 16: తెలంగాణలో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో సాగునీటి వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిందని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పర్యటనలో మాట్లాడిన ఆయన, పదేళ్ల కాలంలో సాగునీటి ప్రాజెక్టుల పేరుతో సుమారు రూ.1.80 లక్షల కోట్లు ఖర్చు చేసినప్పటికీ, ప్రజలకు ఆశించిన ప్రయోజనం అందలేదని ఆరోపించారు.

కాళేశ్వరం ప్రాజెక్టును కమిషన్ల కోసమే నాణ్యతను విస్మరించి నిర్మించారని, అందుకే మూడేళ్లకే బ్యారేజీల్లో సమస్యలు తలెత్తాయని ఉత్తమ్ విమర్శించారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పరిస్థితి ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. అసలు డీపీఆర్‌లో సూచించిన ఫౌండేషన్ విధానాన్ని మార్చి నిర్మాణాలు చేపట్టడం వల్లే నిర్మాణ లోపాలు వెలుగులోకి వచ్చాయని ఆరోపించారు.

సీతారామ సాగర్ ప్రాజెక్టును తమ ప్రభుత్వం తప్పకుండా పూర్తి చేస్తుందని మంత్రి స్పష్టం చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు గోదావరి జలాలను అందించి సాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వ హయాంలో ఈ ప్రాజెక్టు ద్వారా ఒక్క ఎకరానికైనా సాగునీరు అందించలేదని, అది బీఆర్‌ఎస్ పాలన వైఫల్యానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు.

సుందిళ్ల బ్యారేజీని ప్రతిపాదిత స్థలం కాకుండా వేరే ప్రాంతంలో నిర్మించారని, నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా ప్రాజెక్టులు చేపట్టడం వల్లే ఇప్పుడు సమస్యలు ఎదురవుతున్నాయని ఉత్తమ్ అన్నారు. ప్రస్తుతం మూడు బ్యారేజీలపై సాంకేతిక పరీక్షలు కొనసాగుతున్నాయని, ప్రభుత్వం శాస్త్రీయంగా, బాధ్యతాయుతంగా నిర్ణయాలు తీసుకుంటోందని తెలిపారు.

రైతుల సంక్షేమానికి తమ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొన్న మంత్రి, ధాన్యం కొనుగోలు చేసి రైతుల ఖాతాల్లో నేరుగా నగదు జమ చేస్తున్నామని చెప్పారు. లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేసినప్పటికీ ఒక్క ప్రాజెక్టును కూడా పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకురాలేకపోయిన గత ప్రభుత్వమే సాగునీటి వ్యవస్థను నాశనం చేసిందని తీవ్రస్థాయిలో విమర్శించారు. అలాగే ఖమ్మం జిల్లా కాంగ్రెస్‌కు కంచుకోట అని, రాష్ట్ర అభివృద్ధిలో ఈ జిల్లాకు కీలక స్థానం ఉందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.

Spread the love

Related News

Latest News