మెట్రో భూముల విక్రయంపై సంచలన ఆరోపణలు.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ విమర్శలు

ప్రతిపక్షం, జూలై 16: హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుకు సంబంధించిన విలువైన భూములను విక్రయించే ప్రయత్నాలు జరుగుతున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెట్రోకు చెందిన భూములను తన సన్నిహితులకు కట్టబెట్టే కుట్ర చేస్తున్నారని తీవ్ర విమర్శలు చేశారు. హైదరాబాద్ మెట్రో వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజా ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్నాయని ఆయన అన్నారు.

ఢిల్లీ పర్యటనలో కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల మంత్రి హెచ్.డి. కుమారస్వామిని కలిసి ఆదిలాబాద్ సీసీఐ (సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) అంశంపై వినతిపత్రం అందించిన అనంతరం మీడియాతో మాట్లాడిన కేటీఆర్, మెట్రో వ్యవహారంపై తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా ప్రయోజనాల కంటే రియల్ ఎస్టేట్ ప్రయోజనాలకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని విమర్శించారు.

హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టును ఎల్ అండ్ టి నుంచి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలనే ప్రయత్నాల వెనుక అసలు ఉద్దేశం మెట్రోకు చెందిన సుమారు 280 ఎకరాల విలువైన భూములను చేజిక్కించుకోవడమేనని కేటీఆర్ ఆరోపించారు. అంతేకాకుండా మెట్రో ప్రాజెక్టుపై ఉన్న సుమారు రూ.14 వేల కోట్ల రుణభారాన్ని రాష్ట్ర ప్రజలపై మోపేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆయన అన్నారు.

ఈ భూములను బహిరంగ వేలం పేరుతో అధికారానికి దగ్గరగా ఉన్న వ్యక్తులకు అప్పగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని కేటీఆర్ ఆరోపించారు. ప్రజల ఆస్తులను కాపాడాల్సిన ప్రభుత్వం వాటిని ప్రైవేట్ ప్రయోజనాల కోసం వినియోగించేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. హైదరాబాద్ అభివృద్ధి పేరుతో ప్రజా సంపదను దుర్వినియోగం చేయరాదని, మెట్రో భూముల విషయంలో ప్రభుత్వం పూర్తి పారదర్శకత పాటించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

Spread the love

Related News

Latest News