ప్రతిపక్షం, జూన్ 30: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం పరిధిలో వివిధ మఠాలు, సంస్థలకు భూముల కేటాయింపునకు స్పష్టమైన విధానాన్ని రూపొందించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. భూముల యాజమాన్య హక్కులు పూర్తిగా దేవస్థానానికే ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధిపై ఎంసీఆర్ హెచ్ఆర్డీలో నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో సీఎం మాట్లాడుతూ, తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అనుసరిస్తున్న విధానాన్ని అధ్యయనం చేసి అదే తరహాలో భూముల కేటాయింపు విధానాన్ని అమలు చేయాలని చెప్పారు. హరే రామ హరే కృష్ణ చారిటబుల్ ఫౌండేషన్‌కు మార్కెట్ ధర ప్రకారం భూమి కేటాయించాలని సూచించారు.
గుట్టపై అతిథి గృహాల నిర్మాణానికి ఆసక్తి చూపే వారి జాబితా రూపొందించి, టీటీడీ తరహాలో దశలవారీగా అనుమతులు ఇవ్వాలని ఆదేశించారు. కుల సంఘాలకు స్థలాల కేటాయింపుపైనా పారదర్శక నిబంధనలతో కూడిన విధానాన్ని రూపొందించాలని పేర్కొన్నారు.
ఆలయ పరిధిలో అభివృద్ధి పనుల కోసం భూసేకరణకు తక్షణమే నిధులు విడుదల చేయాలని, ఆలయ నిర్మాణానికి సంబంధించి ఇంజనీర్ల కమిటీ నివేదికను వారం రోజుల్లో సమర్పించాలని అధికారులను సీఎం ఆదేశించారు. అలాగే పబ్లిక్–ప్రైవేట్ భాగస్వామ్యంతో యాదగిరిగుట్ట టూరిజం సర్క్యూట్‌ను అభివృద్ధి చేయాలని సూచించారు.
ఈ సమావేశంలో ప్రజాప్రతినిధులు, దేవాదాయ శాఖ, ఆర్థిక శాఖ అధికారులు, ఆలయ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.



















