ప్రతిపక్షం, జూన్ 02: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఘాటుగా స్పందించారు.“తెలంగాణ బరాబర్ మా అయ్య జాగీరే. ఈ నేల మా తండ్రులు, తాతలు పోరాడి కాపాడుకున్న ప్రాంతం” అని పొన్నం పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ మరోసారి అహంకార ధోరణి ప్రదర్శించారని విమర్శించారు.
తెలంగాణ రాష్ట్ర సాధన సమయంలో పవన్ కళ్యాణ్ ఎప్పుడైనా ఉద్యమానికి మద్దతు ఇచ్చారా? అమరవీరుల కుటుంబాలకు అండగా నిలిచారా? అని ప్రశ్నించారు. తెలంగాణపై ఆయన మరోసారి అక్కసు వెళ్లగక్కుతున్నారని ఆరోపించారు.
“నాలుగు నెలల క్రితం రాష్ట్ర ప్రభుత్వ అతిథిగా పవన్ కళ్యాణ్‌ను ఆహ్వానించాం. ఆ విషయాన్ని ఇంత త్వరగా మరిచిపోయారా?” అని ప్రశ్నించిన మంత్రి, ఆంధ్రప్రదేశ్‌లోనే జనసేన బలంగా నిలవలేదని, అలాంటప్పుడు తెలంగాణలోకి వచ్చి ఏం సాధిస్తారని వ్యాఖ్యానించారు.
తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని హెచ్చరించిన పొన్నం ప్రభాకర్, రాష్ట్ర ప్రజల భావోద్వేగాలను గౌరవించాలని సూచించారు.

















