మిడ్జిల్ ప్రజల రుణం తీర్చుకుంటా.. వలసల పాలమూరును అభివృద్ధి పథంలో నడిపిస్తా: సీఎం రేవంత్

ప్రతిపక్షం, జూలై 05: మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్ మండలంతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి భావోద్వేగ ప్రసంగం చేశారు. 20 ఏళ్ల రాజకీయ ప్రస్థానాన్ని పురస్కరించుకుని మిడ్జిల్‌లో నిర్వహించిన కృతజ్ఞత సభలో పాల్గొన్న ఆయన, ప్రజల ఆశీర్వాదంతో జెడ్పీటీసీ స్థాయి నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు ఎదిగానని, ఆ రుణాన్ని అభివృద్ధి రూపంలో తీర్చుకుంటానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ప్రజాప్రతినిధులతో కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.

గత 20 ఏళ్ల ప్రజా జీవితంలో ఒక్కరోజు కూడా సెలవు తీసుకోలేదని, ప్రజలు ఇచ్చిన ప్రతి అవకాశాన్ని బాధ్యతగా వినియోగించుకున్నానని సీఎం తెలిపారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజా సమస్యలపై పోరాడానని, అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమంతో పాటు అభివృద్ధి, దశాబ్దాలుగా పరిష్కారం కాని సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించే దిశగా పనిచేస్తున్నానని చెప్పారు.

మిడ్జిల్ ప్రజలే తన రాజకీయ జీవితానికి పునాది వేసారని పేర్కొన్న సీఎం, 2006 జూలై 4న జెడ్పీటీసీగా సాధించిన విజయం తన వ్యక్తిగత గెలుపు కాదని, మిడ్జిల్ ప్రజల విజయమని అన్నారు. ఆ రోజు ప్రజలు తీసుకున్న నిర్ణయమే తనను ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి స్థానానికి తీసుకొచ్చిందని పేర్కొన్నారు. ఈ ప్రాంతానికి కృతజ్ఞతగా మిడ్జిల్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన మండలంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు.

ఒకప్పుడు రోడ్లు, తాగునీరు, సాగునీరు, విద్య, వైద్యం వంటి కనీస సౌకర్యాలు కూడా లేని మండలంగా మిడ్జిల్ గుర్తింపు పొందిందని గుర్తుచేసిన సీఎం, ఉమ్మడి పాలమూరు జిల్లాలో మిడ్జిల్, గట్టు మండలాలను డార్క్ ఏరియాలుగా ప్రకటించిన పరిస్థితులు తనకు ఇప్పటికీ గుర్తున్నాయని అన్నారు. ఇకపై మిడ్జిల్‌ను కరవుతో అల్లాడే ప్రాంతంగా కాకుండా వెలుగు నిండిన అభివృద్ధి మండలంగా ప్రభుత్వ రికార్డుల్లో నిలబెడతామని స్పష్టం చేశారు. ఈ మండలాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క దత్తత తీసుకోవాలని సభ వేదికగా కోరారు.

తెలంగాణ చరిత్రలో మహబూబ్‌నగర్ జిల్లాకు ప్రత్యేక స్థానం ఉందని సీఎం పేర్కొన్నారు. హైదరాబాద్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు, ఉత్తమ పార్లమెంటేరియన్ జైపాల్ రెడ్డి, ప్రముఖ నాయకుడు మహేంద్రనాథ్, జైపాల్ రెడ్డి రాజకీయ ఎదుగుదలకు బాటలు వేసిన ద్యాప గోపాల్ రెడ్డి వంటి మహనీయులను ఈ సందర్భంగా స్మరించారు. వారి సేవలకు గుర్తింపుగా ద్యాప గోపాల్ రెడ్డి విగ్రహంతో పాటు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం గర్వకారణమని అన్నారు.

ప్రభుత్వం చేపట్టిన చారిత్రాత్మక నిర్ణయాలను ప్రస్తావిస్తూ, నాలుగు దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న ఎస్సీ ఉపకులాల వర్గీకరణ సమస్యకు పరిష్కారం చూపామని తెలిపారు. శతాబ్ద కాలంగా జరగని బీసీ కులగణనను నిర్వహించి, వెనుకబడిన వర్గాలకు వారి వాటా దక్కేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ప్రజలు ముఖ్యమంత్రిగా అవకాశం ఇవ్వకపోతే ఇలాంటి దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించడం సాధ్యమయ్యేది కాదన్నారు.

తాను గ్రామంలో పుట్టి పెరిగిన వ్యక్తినని, రైతు కుటుంబంలో పెరిగిన కారణంగా పేదల కష్టాలు, వ్యవసాయ సమస్యలు, గ్రామీణ జీవన విధానం తనకు బాగా తెలుసని సీఎం చెప్పారు. దుక్కి దున్నడం నుంచి విత్తనం వేయడం వరకు రైతు జీవితంలోని ప్రతి అనుభవం తనకు తెలుసని, అందుకే పరిపాలనలో గ్రామీణాభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నానని వెల్లడించారు.

గ్రామాలు అభివృద్ధి చెందితేనే మండలాలు, జిల్లాలు, రాష్ట్రం అభివృద్ధి చెందుతాయని, అన్ని గ్రామాల పురోగతే దేశాభివృద్ధికి బాటలు వేస్తుందని సీఎం పేర్కొన్నారు. తెలంగాణలోని ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.

చివరగా మిడ్జిల్ ప్రజలపై తనకున్న అనుబంధాన్ని మరోసారి గుర్తుచేసుకున్న సీఎం, “ఈ మండలానికి ఏమిచ్చినా తక్కువే. అవసరమైతే నా ప్రాణం ఇచ్చినా మిడ్జిల్ రుణం తీరదు. వలసల పాలమూరును అభివృద్ధి పాలమూరుగా మార్చే బాధ్యత నాపై ఉంది. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టేలా నిరంతరం పని చేస్తాను” అని స్పష్టం చేశారు.

Spread the love

Related News

Latest News