అంగన్‌వాడీల జీతాలు వెంటనే చెల్లించాలి: సీఎం రేవంత్‌పై హరీశ్‌రావు విమర్శలు

ప్రతిపక్షం, జూన్ 09: అంగన్‌వాడీ సిబ్బందికి రెండు నెలలుగా జీతాలు చెల్లించకపోవడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. మహిళలను కోటీశ్వరులుగా చేస్తామని చెప్పే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ముందుగా అంగన్‌వాడీలకు పెండింగ్ జీతాలు చెల్లించి మహిళల పట్ల తన గౌరవాన్ని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు.

సుమారు 62 వేల మంది అంగన్‌వాడీ టీచర్లు, సహాయకులు వేతనాలు అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు సామాజిక మాధ్యమ వేదికగా స్పందించిన హరీశ్‌రావు, కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా ఉద్యోగుల సమస్యలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు.

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అంగన్‌వాడీల సేవలకు గుర్తింపు లభించిందని, వారి వేతనాలను గణనీయంగా పెంచినట్లు గుర్తుచేశారు. అంగన్‌వాడీ టీచర్ల జీతాలను రూ.13,650కు, మినీ అంగన్‌వాడీ టీచర్లకు రూ.7,800కు, హెల్పర్ల వేతనాలను రూ.7,800కు పెంచి దేశంలోనే అత్యధికంగా చెల్లించిన రాష్ట్రంగా తెలంగాణను నిలిపామని చెప్పారు.

ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అంగన్‌వాడీ టీచర్ల వేతనాలను రూ.18 వేల వరకు పెంచుతామని, ఈపీఎఫ్ పరిధిలోకి తీసుకొచ్చి ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చిందని, అయితే రెండున్నరేళ్లు గడిచినా ఆ హామీలు అమలు కాలేదని విమర్శించారు.

సమస్యల పరిష్కారం కోసం అంగన్‌వాడీలు చేపట్టిన ఆందోళనలపై ప్రభుత్వం పోలీసులను ప్రయోగించిందని ఆరోపించిన హరీశ్‌రావు, పెండింగ్‌లో ఉన్న అంగన్‌వాడీ, మినీ అంగన్‌వాడీ సిబ్బంది వేతనాలను వెంటనే విడుదల చేయాలని బీఆర్ఎస్ తరఫున డిమాండ్ చేశారు.

Spread the love

Related News

Latest News