ప్రతిపక్షం, జూలై 17: తెలంగాణలో గృహజ్యోతి పథకం లబ్ధిదారులకు ఎల్‌నినో ప్రభావం షాక్ ఇస్తోంది. వర్షాకాలంలోనూ అధిక ఉష్ణోగ్రతలు, ఉక్కపోత కారణంగా ఇళ్లలో విద్యుత్ వినియోగం పెరిగి 200 యూనిట్ల పరిమితిని దాటుతోంది. దీంతో పలువురు లబ్ధిదారులు పథకానికి అనర్హులుగా మారుతున్నారు. జూన్ నెలలో ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ పరిధిలోనే దాదాపు 4 లక్షల మంది గృహజ్యోతి పథకం ప్రయోజనాన్ని కోల్పోయినట్లు సమాచారం. ఈ ప్రాంతంలో మొత్తం 26.54 లక్షల మంది లబ్ధిదారులు ఉండగా, 22.59 లక్షల మందికే జీరో బిల్లులు జారీ అయ్యాయి. మిగిలిన వారికి విద్యుత్ వినియోగం 200 యూనిట్లు దాటడంతో బిల్లులు వచ్చినట్లు తెలుస్తోంది. ఇతర విద్యుత్ పంపిణీ సర్కిళ్లలోనూ ఇదే పరిస్థితి నెలకొన్నట్లు సమాచారం. జూలైలోనూ అధిక విద్యుత్ వినియోగం కారణంగా గృహజ్యోతి లబ్ధిదారుల సంఖ్య మరింత తగ్గే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

















