ప్రతిపక్షం, జూన్ 19: హరియాణాలో భక్తి పేరుతో మహిళను సంవత్సరాల పాటు వేధించిన ఓ దొంగబాబాను పోలీసులు అరెస్ట్ చేశారు. తాను దైవస్వరూపుడినని నమ్మించి ఓ మహిళను తన ఆశ్రమంలో బంధించి, శారీరకంగా మరియు మానసికంగా తీవ్ర వేధింపులకు గురి చేసినట్లు ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి.
బాధితురాలి ఫిర్యాదు మేరకు, నిందితుడు ఆమెపై పలుమార్లు లైంగిక దాడులకు పాల్పడటంతో పాటు వివిధ రకాల చిత్రహింసలు పెట్టినట్లు తెలుస్తోంది. వివాహం అనంతరం ఆమె వ్యక్తిగత జీవితాన్ని కూడా తన నియంత్రణలో ఉంచి, వీడియోలతో బెదిరింపులకు పాల్పడ్డాడని ఆరోపించారు.
అంతేకాకుండా, బాధితురితో విడాకులు తీసుకునేలా ఒత్తిడి చేసి, ఆమె ఆస్తులను తన పేరిట బదిలీ చేయించుకున్నట్లు విచారణలో వెల్లడైంది. ఆశ్రమంలో దాదాపు 15 సంవత్సరాల పాటు ఆమెను భయభ్రాంతులకు గురిచేసినట్లు పోలీసులు తెలిపారు.
ఇటీవల బాధితురాలు ఆశ్రమం నుంచి బయటపడగలగడంతో మొత్తం వ్యవహారం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

















