ప్రతిపక్షం, జూలై 06: శ్రీరాముడి పేరును రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగించారని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. సిద్ధిపేటలో మీడియాతో మాట్లాడిన ఆయన, అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం దేశవ్యాప్తంగా ప్రజలు తమ ఆర్థిక స్థోమతకు అనుగుణంగా భక్తిశ్రద్ధలతో విరాళాలు అందించారని తెలిపారు. అయితే ఆ విరాళాల నిర్వహణలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలు ఉన్నాయని పేర్కొంటూ, ఈ అంశంపై బీజేపీ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
రాముడి పేరుతో, అక్షింతల పేరుతో విరాళాలు సేకరించి రాజకీయంగా లబ్ధి పొందేందుకు బీజేపీ ప్రయత్నించిందని మంత్రి ఆరోపించారు. అయోధ్య ప్రజలే బీజేపీ ఎంపీని ఓడించడం ద్వారా తమ అసంతృప్తిని వ్యక్తం చేశారని వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారంపై బీజేపీ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
రాజకీయం ఒకటి, భక్తి మరోటి అని పేర్కొన్న మంత్రి, దేవుడి పేరుతో రాజకీయాలు చేయడం సరికాదన్నారు. ఈ అంశంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా బాధ్యత వహించాలని కోరారు. భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహరించారనే ఆరోపణలపై స్పష్టత ఇవ్వాలని బీజేపీని డిమాండ్ చేస్తూ, ప్రజలు భక్తి పేరుతో జరుగుతున్న రాజకీయాలను గుర్తించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు.
















