బోనాల వేళ చేతివృత్తి కళాకారులకు ప్రోత్సాహం.. జులై 16 నుంచి రాష్ట్రస్థాయి వస్తు ప్రదర్శన

ప్రతిపక్షం, జూలై 05: ఆషాఢ బోనాల పండుగ సందర్భంగా సంప్రదాయ చేతివృత్తి కళాకారులకు ప్రోత్సాహం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక వస్తు ప్రదర్శన-అమ్మకాల మేళాను నిర్వహించనుంది. జులై 16 నుంచి హైదరాబాద్‌లోని హెచ్‌ఎండీఏ గ్రౌండ్స్‌లో రాష్ట్రస్థాయి చేతివృత్తి కళాకారుల ప్రదర్శన ప్రారంభం కానుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ మేళాలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన సంప్రదాయ కులవృత్తుల కళాకారులకు ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేసి వారి ఉత్పత్తులను విక్రయించే అవకాశం కల్పించనున్నట్లు వెల్లడించారు.

మట్టి కుండలు, పూజా సామగ్రి, వెదురు వస్తువులు, చేతిపనులతో తయారైన సంప్రదాయ ఉత్పత్తులు ఈ ప్రదర్శనలో అందుబాటులో ఉండనున్నాయి. బోనాల పండుగ సందర్భంగా అవసరమైన వస్తువులను ఒకేచోట కొనుగోలు చేసే అవకాశం ప్రజలకు లభిస్తుందని మంత్రి తెలిపారు. స్థానిక కళాకారుల శ్రమకు గుర్తింపు లభించేలా ప్రజలు ఈ మేళాను సందర్శించి వారి ఉత్పత్తులను కొనుగోలు చేసి ప్రోత్సహించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ ప్రదర్శన ద్వారా చేతివృత్తుల పరిరక్షణతో పాటు కళాకారుల జీవనోపాధికి ఊతం లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.

Spread the love

Related News

Latest News