Trending Now

ఇల్లందకుంటలో కన్నుల పండువగా కళ్యాణ మహోత్సవం

పట్టు వస్త్రాలు సమర్పించిన జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి

ప్రతిపక్షం, కరీంనగర్ ఏప్రిల్ 17: అపర భద్రాద్రిగా పేరుగాంచిన ఇల్లందకుంటలోని సీతా రామచంద్ర స్వామి దేవస్థానంలో బుధవారం శ్రీరామనవమి పురస్కరించుకొని సీతారాముల కళ్యాణం కన్నుల పండువగా జరిగింది. ఈ వేడుకలకు వేలాది మంది భక్తజనం హాజరయ్యారు. కళ్యాణాన్ని వీక్షించి పులకించిపోయారు. కళ్యాణానికి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి హాజరయ్యారు. అంతకుముందు సీతారామచంద్రస్వామి ఆలయంలో జిల్లా కలెక్టర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం జిల్లా కలెక్టర్ పట్టు వస్త్రాలు, తలంబ్రాలను ఊరేగింపు మధ్య తీసుకొచ్చి స్వామి వారికి సమర్పించారు. వేద పండితులు అభిజిత్ లగ్న సుముహూర్తం సమయాన మంత్రోచ్ఛారణాల మధ్య సీతారాముల కళ్యాణాన్ని వైభవంగా జరిపించారు. భక్తులకు స్వామివారి తలంబ్రాలను ఆలయ సిబ్బంది అందజేశారు. రైస్ మిల్లర్ల సంఘం ఆధ్వర్యంలో అన్నదానం ఏర్పాటు చేశారు.

నిత్య అన్నదానం మంచి కార్యక్రమం.. జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి

ఇల్లందకుంటలో అన్నపూర్ణ ఆర్యవైశ్య సేవా సంస్థాన్ ఆధ్వర్యంలో భక్తులకు, పలు కార్యక్రమాలకు హాజరయ్యే వారికి నిత్య అన్నదానం చేయడం చాలా మంచిదని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పేర్కొన్నారు. బుధవారం స్వామివారి కళ్యాణానికి హాజరై నిత్య అన్నదాన సత్రాన్నిజిల్లా కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అన్నదాన కార్యక్రమంపై నిర్వాహకులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

రాబోయే రోజుల్లో సామాజిక సేవా కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ నిర్వాహకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, ట్రైనీ కలెక్టర్ అజయ్ యాదవ్, నిత్య అన్నదాన సత్రం గౌరవ అధ్యక్షుడు ఎలుగూరి రమేష్, అధ్యక్షుడు కాసం నగేష్, సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News