హైదరాబాద్, ప్రతిపక్షం స్టేట్బ్యూరో: తెలంగాణలో ఇకపై వాహనాల రిజిస్ట్రేషన్ టీజీ పేరిట కానున్నాయి. ఈ మేరకు కేంద్ర రహదారి రవాణాశాఖ గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కేంద్రానికి పంపిన తీర్మానానికి అనుగుణంగా ఈ మార్పు చేసినట్లు కేంద్రం నోటిఫికేషన్‌లో పేర్కొంది. మోటారు వాహనాల చట్టం 1988లోని సెక్షన్ 41(6) కింద ఉన్న అధికారాలను ఉపయోగించి 1989 జూన్ 12న అప్పటి ఉపరితల రవాణా శాఖ జారీచేసిన గెజిట్ నోటిఫికేషన్‌లో ఈ మార్పు చేసినట్లు పేర్కొంది. ఆ నోటిఫికేషన్‌లోని టేబుల్‌లో సీరియల్ నంబర్ 29ఏ కింద తెలంగాణ రాష్ట్రానికి ఇదివరకు ఉన్న టీఎస్ స్థానంలో ఇప్పుడు టీజీ మార్క్ కేటాయించినట్లు వివరించింది.
సీఎం రేవంత్‌రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత వాహన రిజిస్ట్రేషన్ మార్క్‌లో మార్పు చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. గత ప్రభుత్వం తమ పార్టీ అందరికీ గుర్తుండాలనే ఉద్దేశంతో టీజీని కాదని టీఎస్‌గా నిర్ణయించిందని దానిని మార్చాలని తెలంగాణ కేబినేట్ తీర్మానం చేసింది. ఆ తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపింది. దాన్ని అనుసరించి కేంద్రం మార్పు చేస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇకపై రిజిస్టర్ అయ్యే వాహనాల మార్క్ టీజీగా మారనుంది.
పాత వాహనాలు అదే రిజిస్ట్రేషన్‌పై..
మరోవైపు రాష్ట్రంలో ఇప్పటికే రిజిస్టర్ అయిన పాత వాహనాల పరిస్థితి ఏంటని వాహనదారుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత సంవత్సరం నవంబర్ 30 నాటికి రవాణా శాఖలో తెలంగాణవ్యాప్తంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వాహనాలు 1,60,81,666 ఉన్నాయి. అయితే ఇప్పుడు పాత వాహనాలకు కూడా టీఎస్‌ను తొలగించి టీజీ రిజిస్ట్రేషన్ చేస్తేనే ఆర్థికంగా భారం పడుతుందని వారు వాపోతున్నారు. అయితే పాత వాహనాలు అదే రిజిస్ట్రేషన్‌తోనే కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో వాహనదారులు ఊపిరిపీల్చుకున్నారు.