Trending Now

రేపు కాంగ్రెస్​ ఎంపీ అభ్యర్థుల ప్రకటన..

హైదరాబాద్​, ప్రతిపక్షం స్టేట్​బ్యూరో: రాష్ట్రంలో కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థుల జాబితా మంగళవారం వెలువడబోతోంది. ఆదివారం రాత్రి ముంబయిలో సమావేశమైన స్క్రీనింగ్ కమిటీ అభ్యర్థుల ఎంపికపై సుదీర్ఘంగా చర్చించించి షార్ట్​ లీస్టును తయారు చేసింది. మంగళవారం ఢిల్లీలో జరగనున్న కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం అభ్యర్థుల ఎంపికపై తుది నిర్ణయం తీసుకోనుంది. తెలంగాణ రాష్ట్రంలో లోకసభ ఎన్నికల వేడి రోజువారీ రాజకీయ పరిణామాలను మార్చేస్తోంది. బీఆర్‌ఎస్‌, బీజేపీలు ఇప్పటికే ఎంపీ ఎన్నికలకు ఎక్కువ మంది అభ్యర్ధులను ప్రకటించగా, కాంగ్రెస్‌ మాత్రం నాలుగు స్థానాలకు మాత్రమే అభ్యర్ధులను ప్రకటించింది. తాజాగా మిగిలిన 13 లోకసభ స్థానాలకు సంబంధించి మంగళవారం దిల్లీలో జరగనున్న కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో అభ్యర్థుల ఎంపికపై తుది నిర్ణయం తీసుకోనుంది.

ఇప్పటికే ఎన్నికల షెడ్యూలు వెల్లడికాగా మిగిలిన 13 స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం ప్రత్యేక దృష్టి సారించింది. తొలి జాబితాలో జహీరాబాద్, మహబూబాబాద్‌, నల్గొండ, మహబూబ్‌నగర్‌ సీట్లకు అభ్యర్థులను ప్రకటించారు. ఇప్పటికే 13 నియోజకవర్గాలకు సంబంధించి టికెట్‌ ఆశావహులపై కాంగ్రెస్ రాజకీయ వ్యూహకర్త సునీల్ కనుగోలు బృందం ఫ్లాష్ సర్వేలు నిర్వహించింది.

ఈ వివరాలతో ఆదివారం రాత్రి ముంబయిలో స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ హరిష్ చౌదరి అధ్యక్షతన జరిగినభేటీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి దీపా దాస్ మున్షి, ఏఐసీసీ ఇంఛార్జ్‌ కార్యదర్శులు రోహిత్ చౌదరి, మన్సూర్ అలీ ఖాన్, విష్ణునాథ్ పాల్గొన్నారు. నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలు, అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జీలు, డీసీసీ అధ్యక్షులు నుంచి తీసుకున్న అభిప్రాయాలు, సునీల్ కనుగోలు బృందం నిర్వహించిన ఫ్లాష్ సర్వేల సమాచారంపై స్క్రీనింగ్ కమిటీ చర్చించినట్లు తెలుస్తోంది. అభ్యర్థుల ఎంపికలో అనేక అంశాలను ప్రామాణికంగా తీసుకుంటారని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి.

సామాజిక సమతుల్యత పాటిస్తూనే గెలుపు గుర్రాలకు టికెట్లు ఇచ్చే దిశలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం ముందుకెళుతోంది. జనాదరణ కలిగిన నాయకులనే బరిలో దించాలని భావిస్తున్న రాష్ట్ర నాయకత్వం కాంగ్రెస్ సిద్ధాంతం నచ్చి పార్టీలో చేరే బలమైన నాయకులను బరిలోదించే యోచనలో ఉంది. మంగళవారం దిల్లీలో జరగనున్న కేంద్ర ఎన్నికల కమిటీ రాష్ట్రానికి చెందిన లోకసభ అభ్యర్థుల ప్రకటన వెలువడుతుందని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఏఐసీసీ ప్రకటించనున్న నాలుగో జాబితాలో రాష్ట్ర లోక్‌సభ అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తుందని పీసీసీ వర్గాలు చెబుతున్నాయి. స్క్రీనింగ్ కమిటీ చర్చించి నిర్ణయం తీసుకున్న పేర్ల జాబితాను రేపు జరగనున్న కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశానికి నివేదించనున్నది.

Spread the love