Trending Now

మహబూబాబాద్ ఆర్టీఏలో ఏసీబీ అధికారుల సోదాలు..

సోదాలు కొనసాగుతున్నట్లు వెల్లడించిన ఏసీబీ డీఎస్పీ సాంబయ్య

ప్రతిపక్షం, ప్రతినిధి హనుమకొండ, మే 28: ఆర్టీఏ కార్యాలయాలలో అవినీతి విచ్చలవిడిగా సాగుతుంది. ఆ శాఖ అధికారులు తమ ఆగడాలకు అడ్డే లేదన్నట్టు వ్యవహరిస్తున్న తీరును గత మూడు రోజులుగా ‘ప్రతిపక్షం’ దినపత్రిక కథనాలు వెలువరిస్తున్న విషయం తెలిసిందే. దీంతో స్పందించిన ఏసీబీ డీజీ సీవీ ఆనంద్ ఆదేశాల మేరకు మంగళవారం మహబూబాబాద్ జిల్లా ఆర్టిఏ కార్యాలయంపై ఏసీబీ ఆకస్మిక దాడి చేసింది. ఈ దాడుల్లో ఆరుగురు ఏజెంట్లు, డీటీఓ డ్రైవర్ వద్ద నుంచి 45 వేల ఒక వంద రూపాయల నగదు, వాహన రిజిస్ట్రేషన్లు, డ్రైవింగ్ లైసెన్సు, ఫిట్నెస్ కు సంబంధించిన పలు పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ డీఎస్పీ సాంబయ్య మీడియాకు వెల్లడించారు.

ఏసీబీ కార్యాలయంపై జరిగిన దాడికి సంబంధించి డీఎస్పీ మాట్లాడుతూ.. గత కొంతకాలంగా మహబూబాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో అవకతవకలు జరుగుతున్నాయనే ఆరోపణల నేపథ్యంలో డీజీ సీవీ ఆనంద్ ఆదేశాల మేరకు ఆకస్మిక దాడి చేయడం జరిగిందని వివరించారు. ఈ దాడుల్లో నిబంధనలకు విరుద్ధంగా పలువురు ఏజెంట్లు వాహన రిజిస్ట్రేషన్స్, డ్రైవింగ్ లైసెన్స్, వాహన ఫిట్నెస్ పత్రాలతో నగదు తో పాటు
కార్యాలయంలో ఉన్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా డి టి ఓ గౌస్ పాషా డ్రైవర్ కొంత నగదు, పలు వాహన పత్రాలు, వాహన తాళాలు కలిగి ఉండడంతో అతనిని సైతం అదుపులోకి తీసుకొవడం జరిగిందన్నారు. నిబంధనల ప్రకారం ఆర్టీఏ అనుమతులకు నగదు చెల్లింపులు కాకుండా “చలాన” రూపంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుందన్నారు. అంతేకాకుండా ఎవరికి కూడా కార్యాలయంలోకి అనుమతి ఉండదని దరఖాస్తులు సమర్పించాల్సి వస్తే కౌంటర్లలో మాత్రమే దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుందన్నారు. కానీ నిబంధనలకు విరుద్ధంగా కొంతమంది ఏజెంట్లు నగదు కలిగి ఉండి వాహన పత్రాలతో కార్యాలయంలోపలికి రావడం చట్ట విరుద్ధమని వెల్లడించారు.

అంతేకాకుండా కౌంటర్‌లలో ఉన్న ఆర్టీఏ సిబ్బంది వద్ద సైతం రిజిస్టర్లో నమోదు చేసిన వివరాలకు మించి నగదు కలిగి ఉన్నట్లు వెల్లడించారు. సోదాలు ఇంకా కొనసాగుతున్నాయని మిగతా వివరాలు సోదాల అనంతరం మీడియాకు వెల్లడిస్తామని ఏసీబీ డీఎస్పీ సాంబయ్య తెలిపారు. ఈ దాడుల్లో సీఐలు ఎల్ రాజు, ఎస్ రాజు, ఎస్సై శ్యాంసుందర్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News