ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల ఫీజుల దోపిడీపై చర్యలు తీసుకోవాలి

•బీజేపీ జిల్లా మీడియా కన్వీనర్ గజరాజుల తిరుమలేష్

ప్రతిపక్షం, జూలై 03, వనపర్తి ప్రతినిధి: వనపర్తి జిల్లా కేంద్రంలో ఉన్న కార్పొరేట్ పాఠశాలలు శ్రీ చైతన్య, నారాయణ, రాక్‌వుడ్, ఢిల్లీ వరల్డ్ స్కూల్ తదితర విద్యాసంస్థలు విద్యార్థుల నుంచి అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నాయని.. వెంటనే ఫీజుల దోపిడీపై చర్యలు తీసుకోవాలని బీజేపీ జిల్లా మీడియా కన్వీనర్ గజరాజుల తిరుమలేష్ ఆరోపించారు. ప్రైవేట్ పాఠశాలలు విద్యార్థులకు అవసరమైన పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్, యూనిఫార్ములు మరియు ఇతర విద్యా సామగ్రిని తమ పాఠశాలల ద్వారానే కొనుగోలు చేయాలని ఒత్తిడి తెస్తూ, అధిక ధరలకు విక్రయిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ట్యూషన్ ఫీజులతో పాటు వివిధ పేర్లతో అదనపు ఫీజులు వసూలు చేయడం వల్ల తల్లిదండ్రులపై తీవ్ర ఆర్థిక భారం పడుతోందని అన్నారు.ఈ పరిస్థితులపై జిల్లా విద్యాశాఖ అధికారులు, సంబంధిత జిల్లా యంత్రాంగం నామమాత్రంగా తనిఖీలు నిర్వహిస్తూ, తగిన చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నారని ఆయన విమర్శించారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, జిల్లా విద్యాశాఖ అధికారులు స్పందించి, కార్పొరేట్ మరియు ప్రైవేట్ పాఠశాలల్లో జరుగుతున్న ఫీజుల దోపిడీ, పుస్తకాల బలవంతపు విక్రయాలు, ఇతర అక్రమ వసూళ్లపై సమగ్ర విచారణ చేపట్టి నిబంధనలు ఉల్లంఘిస్తున్న విద్యాసంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ జిల్లా మీడియా కన్వీనర్ గజరాజుల తిరుమలేష్ డిమాండ్ చేశారు.

Spread the love

Related News

Latest News