ప్రతిపక్షం, జూన్ 11: తమిళ సినీ దిగ్గజం రజినీకాంత్ అల్లుడు విశాగన్ త్వరలో రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నారనే వార్తలు తమిళనాడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల రాజకీయ పార్టీ బాధ్యతల నుంచి వైదొలిగిన అన్నామలైతో ఆయన సమావేశం కానున్నట్లు సమాచారం. అన్నామలై ప్రారంభించిన ప్రజా ఉద్యమంలో విశాగన్ కీలక పాత్ర పోషించే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది.
రజినీకాంత్ చిన్న కుమార్తె సౌందర్య భర్త అయిన విశాగన్ ఇప్పటివరకు వ్యాపార, సినీ రంగాలకు మాత్రమే పరిమితమయ్యారు. అయితే ప్రస్తుతం సామాజిక, రాజకీయ అంశాలపై ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయన రాజకీయ ప్రవేశంపై ఊహాగానాలు మరింత బలపడుతున్నాయి.
ఇక అన్నామలై ప్రారంభించిన ప్రజా ఉద్యమానికి రాష్ట్రవ్యాప్తంగా విశేష స్పందన లభిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే లక్షలాది మంది ఈ ఉద్యమానికి మద్దతు ప్రకటించగా, యువతలో కూడా మంచి ఆదరణ కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో విశాగన్ చేరిక ఉద్యమానికి మరింత బలం చేకూర్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.














