వర్షాభావంపై అప్రమత్తం.. హుస్నాబాద్‌లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన మంత్రి పొన్నం ప్రభాకర్

ప్రతిపక్షం, జూలై 23: ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో ఏర్పడిన వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. హుస్నాబాద్ ఆర్డీవో కార్యాలయంలో నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో సిద్దిపేట, కరీంనగర్, హనుమకొండ జిల్లాల కలెక్టర్లు హైమవతి, చిత్రా మిశ్రా, చాహత్ బజ్‌పేయి, అదనపు కలెక్టర్లు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని, శాస్త్రవేత్తల అంచనాల ప్రకారం వచ్చే జూన్ వరకు ఆశించిన స్థాయిలో వర్షాలు కురిసే అవకాశం లేదని తెలిపారు. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తాగునీటి కొరత రాకుండా ఇప్పటి నుంచే కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు.

గ్రామీణ ప్రాంతాల్లో అధికారులు క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండాలని, ప్రభుత్వ కార్యక్రమాలను ఎలాంటి ఒత్తిళ్లు లేకుండా ప్రజలకు సమర్థవంతంగా చేరవేయాలని సూచించారు. ప్రజా ప్రతినిధులు, గ్రామస్థాయి సిబ్బంది నుంచి జిల్లా స్థాయి అధికారుల వరకు సమన్వయంతో పనిచేస్తేనే వర్షాభావ పరిస్థితులను సమర్థంగా ఎదుర్కోవచ్చని పేర్కొన్నారు.

వ్యవసాయ రంగంపై ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి సూచించారు. కరువు పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు ఆరుతడి పంటల సాగుకు మొగ్గు చూపేలా అవగాహన కల్పించాలని, ఉద్యానవన శాఖ ద్వారా ఆయిల్ పామ్ వంటి ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించాలని అధికారులకు సూచించారు.

పశుసంవర్ధక శాఖ అధికారులు పశుగ్రాస కొరత తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, రైతులకు అవసరమైన సూచనలు అందించాలని ఆదేశించారు. అలాగే భూగర్భ జలాలు రోజురోజుకు పడిపోతున్న నేపథ్యంలో వాటి సంరక్షణకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాలని చెప్పారు.

వర్షపు ప్రతి చుక్కను సంరక్షించేలా ఇంకుడు గుంతలు, వర్షపు నీటి సంరక్షణ చర్యలను విస్తృతంగా చేపట్టాలని, ప్రత్యేక యాక్షన్ ప్లాన్‌తో భూగర్భ జలాల పెంపుపై దృష్టి సారించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు.

Spread the love

Related News

Latest News