ప్రతిపక్షం, జూన్ 10: రాష్ట్రంలోని మహిళలను ఆర్థికంగా మరింత బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కోటిమంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దే వరకు ప్రభుత్వం విశ్రమించదని ఆయన పేర్కొన్నారు. మహిళా సాధికారతకు ప్రాధాన్యం ఇస్తూ పలు కీలక కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు వెల్లడించారు.
మహిళా శక్తి పథకం కింద ఇప్పటికే మహిళా స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో 553 బస్సులను రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు అప్పగించినట్లు తెలిపారు. ఇదే కార్యక్రమాన్ని మరింత విస్తరించి, రానున్న రోజుల్లో మరో మూడు వేల బస్సులను మహిళా సంఘాల ద్వారా అద్దె ప్రాతిపదికన ఆర్టీసీకి అందజేస్తామని ప్రకటించారు.
ఇందిరమ్మ గృహాల మంజూరులో మహిళలకు ప్రాధాన్యం ఇస్తున్నామని, అన్ని ఇళ్లను మహిళల పేర్లపైనే మంజూరు చేస్తున్నట్లు సీఎం వెల్లడించారు. అదే విధంగా పట్టణ ప్రాంతాల్లో లక్ష ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందని, ఆ ఇళ్లను కూడా మహిళల పేరిటే కేటాయిస్తామని స్పష్టం చేశారు.
ఆస్తులు మహిళల పేర్లపై ఉండేలా చర్యలు తీసుకోవడం ద్వారా వారి ఆర్థిక భద్రత మరింత పెరుగుతుందని సీఎం అభిప్రాయపడ్డారు. స్వయం సహాయక సంఘాలను అభివృద్ధి భాగస్వాములుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతోందని తెలిపారు.

















