ప్రతిపక్షం, జూలై 19: భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధినేత కేసీఆర్, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనను లక్ష్యంగా చేసుకుని మాట్లాడుతూ, అధికారంలోకి వచ్చిన తర్వాత కొందరు అనూహ్యంగా అపార ఆస్తులు కూడబెట్టుకున్నారని ఆరోపించారు.
“గంజి గతిలేని వాళ్లకు బెంజి వచ్చింది. అమెరికాలో దొడ్లు కడిగేవాళ్లు మంత్రులయ్యారు. పాస్‌పోర్ట్ బ్రోకర్ ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు నిజాంలకంటే ఎక్కువ ఆస్తులు ఎలా సంపాదించారు?” అంటూ పేర్లు ప్రస్తావించకుండా కేసీఆర్, కేటీఆర్‌లపై సీఎం పరోక్ష విమర్శలు చేశారు.
బీఆర్ఎస్ హయాంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తీవ్రంగా దెబ్బతిందని ఆరోపించిన రేవంత్ రెడ్డి, తెలంగాణను సుమారు రూ.8 లక్షల కోట్ల అప్పుల్లోకి నెట్టారని విమర్శించారు. ప్రజల సంక్షేమం కంటే వ్యక్తిగత ఆస్తుల పెంపుకే ప్రాధాన్యం ఇచ్చారని, అధికారాన్ని ఉపయోగించుకుని భారీ ఫామ్‌హౌస్‌లు, ఆస్తులు కూడబెట్టుకున్నారని అన్నారు.
ఉద్యోగాల భర్తీ విషయంలోనూ గత ప్రభుత్వంపై సీఎం తీవ్ర ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్ పాలనలో ఉద్యోగ నియామకాలు సక్రమంగా జరగకపోవడంతో వేలాది మంది నిరుద్యోగులు తీవ్ర నిరాశకు గురయ్యారని, ఆ పరిస్థితుల్లో ఎందరో యువకులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రస్తుత ప్రభుత్వం పారదర్శక పాలన, ఉద్యోగాల భర్తీ, ప్రజా సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తోందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గత ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల ముందుకు తీసుకువెళ్తూనే, రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని పేర్కొన్నారు.
















