ప్రతిపక్షం బ్యూరో, ఉత్తర తెలంగాణ, జూలై 18: “మానత్వం మాటల్లో కాదు… అవకాశాల్లో కనిపించాలనే సంకల్పంతో ఇందిరమ్మ రాజ్యం ప్రజా ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ట్రాన్స్జెండర్ సమాజానికి స్థానిక సంస్థల్లో కో-ఆప్షన్ సభ్యులుగా అవకాశం కల్పించే ప్రక్రియకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలపడం సామాజిక న్యాయానికి, రాజ్యాంగ స్ఫూర్తికి నిదర్శనం. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ చారిత్రాత్మక నిర్ణయం ట్రాన్స్జెండర్ సమాజానికి గౌరవం, గుర్తింపు, నాయకత్వానికి నాంది పలుకుతోంది” అని తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి, గిరిజన సంక్షేమం, దివ్యాంగులు, వయోవృద్ధులు మరియు ట్రాన్స్జెండర్ వ్యక్తుల సంక్షేమ శాఖ మంత్రి శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు పేర్కొన్నారు.శనివారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో తెలంగాణకు చెందిన సుమారు 25 మంది ట్రాన్స్జెండర్ లు.ట్రాన్స్ ఉమెన్ హక్కుల ఉద్యమకారులు , ట్రాన్స్మెన్ హక్కుల ఉద్యమకారులు , ట్రాన్స్ హిజ్రా సంస్కృతి గురువులు, ట్రాన్స్ జెండర్ వ్యక్తుల తో పాటు వివిధ ట్రాన్స్జెండర్ సంఘాల ప్రతినిధులు మంత్రిని కలిసి రాష్ట్ర కేబినెట్ తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయానికి ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి అడ్లూరికి శాలువాతో సన్మానం చేసి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ… ట్రాన్స్జెండర్ సమాజాన్ని సంక్షేమ పథకాలకే పరిమితం చేయకుండా పాలనలో భాగస్వాములను చేయాలన్న దృఢ సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. స్థానిక సంస్థల్లో కో-ఆప్షన్ సభ్యులుగా అవకాశం కల్పించడం ద్వారా గ్రామాలు, మండలాలు, పట్టణాల అభివృద్ధిలో ట్రాన్స్జెండర్ ప్రతినిధుల స్వరం వినిపించే అవకాశం కలుగుతుందని తెలిపారు.

















