ప్రతిపక్షం, జూలై 14: ఢిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశమై తెలంగాణకు సంబంధించిన కీలక రహదారి ప్రాజెక్టులపై చర్చించారు. ఇప్పటికే ప్రాంతీయ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్) ఉత్తర భాగంలో 95 శాతం భూసేకరణ పూర్తయిందని, పనులు ప్రారంభించేందుకు కేంద్ర మంత్రిమండలి అనుమతి త్వరగా ఇవ్వాలని కోరారు. ఉత్తర, దక్షిణ భాగాల్లో ఒకేసారి పనులు ప్రారంభిస్తే నిర్మాణం వేగంగా పూర్తవడంతో పాటు వ్యయం కూడా తగ్గుతుందని వివరించారు.
ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగానికి అవసరమైన అనుమతులను కూడా వెంటనే మంజూరు చేయాలని సీఎం విజ్ఞప్తి చేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ రాజధానికి గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మించాల్సి ఉన్నందున, ఆ ప్రాజెక్టుకు కూడా కేంద్రం తక్షణ అనుమతులు ఇవ్వాలని కోరారు.
భారత్ ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి మీదుగా బందరు పోర్టు వరకు 12 వరుసల జాతీయ రహదారిని మంజూరు చేస్తే హైదరాబాద్–విజయవాడ మధ్య దూరం సుమారు 100 కిలోమీటర్లు తగ్గుతుందని, సరుకు రవాణా మరింత వేగవంతం అవుతుందని సీఎం వివరించారు.
మన్ననూరు–శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్‌కు అవసరమైన అటవీ శాఖ అనుమతులు త్వరగా మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని గడ్కరీని కోరారు. నల్లమల అభయారణ్యం, శ్రీశైలం దేవస్థానం, శ్రీశైలం జలాశయం ప్రాంతాలకు ఈ కారిడార్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు.
అదేవిధంగా హైదరాబాద్–మంచిర్యాల మధ్య ప్రస్తుతం ఉన్న రాజీవ్ రహదారికి ప్రత్యామ్నాయంగా ఆరు వరుసల కొత్త రహదారికి అనుమతులు ఇవ్వాలని సీఎం విజ్ఞప్తి చేశారు. ఈ రహదారికి అవసరమైన భూసేకరణను రాష్ట్ర ప్రభుత్వమే చేపడుతుందని, దీని ద్వారా వ్యవసాయ, పారిశ్రామిక, వాణిజ్య రంగాలకు కొత్త అవకాశాలు ఏర్పడతాయని పేర్కొన్నారు.
ఈ సమావేశంలో నల్గొండ ఎంపీ రఘువీర్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు.


















