ప్రతిపక్షం, జూన్ 23: రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ స్పష్టమైన మెజారిటీతో అధికారంలోకి వస్తుందని, పార్లమెంట్ స్థానాలతో పాటు మూడు కార్పొరేషన్లలోనూ బీజేపీ మేయర్ పీఠాలను కైవసం చేసుకుంటుందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు అన్నారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఎన్ని రాజకీయ వ్యూహాలు అమలు చేసినా ప్రజలు బీజేపీ వైపే నిలుస్తారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఓటు చోరీ అంశంపై కాంగ్రెస్ మాట్లాడే నైతిక హక్కు లేదని విమర్శిస్తూ, దేశంలో అక్రమ రాజకీయాలకు కాంగ్రెస్ పార్టీనే నాంది పలికిందని ఆరోపించారు.
ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు మైనారిటీలను తప్పుదోవ పట్టిస్తున్నాయని రాంచందర్ రావు విమర్శించారు. ఈ ప్రక్రియ ద్వారా కేవలం చనిపోయినవారి, ఇతర ప్రాంతాలకు మారిపోయినవారి పేర్లు మాత్రమే తొలగిస్తారని, నిజమైన ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని స్పష్టం చేశారు.
ప్రస్తుత ఓటర్ల జాబితాల్లో విదేశీయుల పేర్లు ఉన్నాయని ఆరోపిస్తూ, వాటిని తొలగించడం ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగమని పేర్కొన్నారు. మహేశ్వరం నియోజకవర్గంలో వేలాది అనుమానాస్పద ఓట్లపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు.
అలాగే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు లోపాయికారీగా కలిసి పనిచేస్తున్నాయని, రాబోయే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కూడా ఎంఐఎంకు సహకరించే ప్రయత్నాలు చేస్తున్నాయని ఆరోపించారు. ఈ రెండు పార్టీలు బీజేపీని అడ్డుకోవడమే లక్ష్యంగా రాజకీయ కుట్రలు చేస్తున్నాయని, అయితే ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారని రాంచందర్ రావు అన్నారు.

















