Trending Now

భారత్‌-యూఏఈ దోస్తీ జిందాబాద్‌!

– ప్రవాస భారతీయులతో ప్రధాని మోదీ

అబుదాబీ:

యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ నలుమూలల నుంచి వచ్చిన ప్రవాస భారతీయులంతా సరికొత్త చరిత్రను సృష్టించారని, 140 కోట్ల మంది భారతీయులు వారిని చూసి గర్వపడుతున్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అబుదాబిలోని జాయెద్‌ స్పోర్ట్స్‌ సిటీ స్టేడియంలో నిర్వహించిన ‘అహ్‌లాన్‌ మోదీ’ కార్యక్రమంలో భాగంగా వేలాది మంది ప్రవాస భారతీయులనుద్దేశించి ప్రధాని ప్రసంగించారు. ఇక్కడ ప్రతిఒక్కరి ప్రతి శ్వాస, గుండె చప్పుడు, స్వరం.. ‘భారత్‌- యూఏఈ దోస్తీ జిందాబాద్‌!’ అని నినదిస్తున్నట్లు వ్యాఖ్యానించారు. ఇరుదేశాల సంబంధాలు కొత్త శిఖరాలకు చేరాయన్నారు.
మోదీకి అత్యున్నత పౌర పురస్కారం..
యూఏఈ ప్రభుత్వం తనను అత్యున్నత పౌర పురస్కారం ‘ది ఆర్డర్‌ ఆఫ్‌ జాయెద్‌’ తో గౌరవించినట్లు ప్రధాని మోదీ వెల్లడించారు. ‘‘సాంస్కృతిక, ప్రజా సంబంధాల్లో భారత్‌- యూఏఈలు కలిసి సాధించిన పురోగతి ప్రపంచానికి ఒక నమూనా. ఈ దేశం నేడు భారత్‌కు మూడో అతిపెద్ద వాణిజ్య భాగస్వామి, ఏడో అతిపెద్ద పెట్టుబడిదారు. ఇక్కడి విద్యాసంస్థల్లో 1.5 లక్షల మంది భారతీయ విద్యార్థులు చదువుకుంటున్నారు’’ అని తెలిపారు. కార్యక్రమంలో భాగంగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళీ భాషల్లోనూ ప్రధాని మాట్లాడటం విశేషం. త్వరలో ఇక్కడ ‘యూపీఐ’ సేవలు ప్రారంభించనున్నట్లు తెలిపారు. తాను ఈ దేశానికి రావడం ఇది ఏడోసారని పేర్కొంటూ.. గత పర్యటనలను మోదీ గుర్తుచేసుకున్నారు. 2015లో స్థానికంగా ఆలయ నిర్మాణం గురించి ప్రతిపాదించగా.. యూఏఈ పాలకుడు వెంటనే అంగీకరించినట్లు చెప్పారు. అబుదాబిలో నిర్మించిన మొట్టమొదటి హిందూ దేవాలయాన్ని బుధవారం ప్రారంభించనున్న విషయం తెలిసిందే.
స్టేడియంలో సందడి!
వేలాదిమంది ప్రవాస భారతీయులతో స్టేడియం కిక్కిరిసిపోయింది. వారంతా భారతీయ శైలి వస్త్రధారణలతో ఆకట్టుకున్నారు. భారతీయ గీతాలపై నృత్యాలు, సాంస్కృతిక ప్రదర్శనలతో సందడి చేశారు. అంతకుముందు ‘ఐఐటీ దిల్లీ- అబుదాబి క్యాంపస్‌’ తొలి బ్యాచ్‌ విద్యార్థులతో ప్రధాని మోదీ ముచ్చటించారు. యూఏఈ అధ్యక్షుడితో ద్వైపాక్షిక సమావేశం అనంతరం అబుదాబిలోని ఓ హోటల్‌కు చేరుకున్న ప్రధాన మంత్రికి ప్రవాస భారతీయులు ఘన స్వాగతం పలికారు. దీనికి సంబంధించిన ఫొటోలను ‘ఎక్స్‌’ వేదికగా పోస్ట్‌ చేసిన మోదీ.. వారి చైతన్యాన్ని ప్రశంసించారు.

Spread the love