పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్‌కు అవకాశం ఇవ్వాలి..
ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, ఏప్రిల్ 27 : శాసనసభ ఎన్నికలలో భారీ మెజార్టీతో గెలిపించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్న తెలంగాణ ప్రజలు, కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుకు భారీ మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని పీసీసీ ఉపాధ్యక్షులు, అదిలాబాద్ పార్లమెంట్ ఎన్నికల ఇన్చార్జ్ శ్రవణ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం నిర్మల్‌లో నిర్వహించిన కాంగ్రెస్ నియోజకవర్గ పూర్తిస్థాయి నాయకులు, కార్యకర్తల అవగాహన సదస్సులో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో శాసనసభ ఎన్నికల సమయంలో ఏ రకంగా నైతే కష్టపడి పని చేసి.. అధికారంలోకి తీసుకొచ్చారో అదే రకంగా పార్లమెంట్ ఎన్నికలలో గెలుపునకు కృషి చేయాలని కోరారు.
శాసనసభ ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీ పథకాలను అధికారంలోకి వచ్చిన మూడు రోజుల నుండి అమలు చేయడం ప్రారంభించామని పేర్కొన్నారు. మహిళలకు ఉచిత బస్సు సర్వీసు, ఉచిత కరెంటు, 500 కి గ్యాస్ సిలిండర్ విజయవంతంగా అమలు చేస్తున్నామన్నారు. రైతులకు రుణమాఫీ చేస్తామని హామీ ఇవ్వడం జరిగిందని ఆగస్టు 15 లోగా రైతులకు రుణమాఫీ అమలు చేసి తీరుతామని భరోసా కల్పించారు. హరీష్ రావు జిమ్మిక్కులు చేసి మాట్లాడుతున్నాడని రెండు పర్యాయాలు 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఏకకాలంలో రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చి మాట తప్పారని ఆరోపించారు.
రాష్ట్రంలోని ఏ ఒక్క గ్రామానికి కూడా, ఏ ఒక్క రైతుకు కూడా పూర్తిస్థాయిలో రుణమాఫీ చేసిన దాఖలాలు లేవని, కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా రైతులకు 65 వేల కోట్ల రూపాయల రుణమాఫీని చేసిందని వివరించారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏవైతే హామీలను ఇస్తుందో వాటన్నిటిని చిత్తశుద్ధితో దేశవ్యాప్తంగా గతంలో అమలు చేసిన మాదిరిగా అమలు చేస్తామని, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలను కచ్చితంగా అమలు చేసి తీరుతామని తెలిపారు. ఇండియా అలయన్స్ ఇచ్చిన హామీలను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తప్పకుండా అమలు చేస్తామన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుండి ఒక పేదింటి మహిళకు టికెట్ ఇచ్చి అభ్యర్థిగా నిలబెట్టిందని ప్రజల పక్షాన పోరాటం చేసిన ఆత్రం సుగుణపై 52 కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు. ప్రజల గొంతుకగా రైతులు బలహీన వర్గాలు శ్రామికుల గొంతుకగా పార్లమెంటులో వాని వినిపించాలంటే ఆత్రం సుగుణను ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం లో మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, నిర్మల్ ఎంపీపీ కొరిపల్లి రామేశ్వర్ రెడ్డి, జెడ్పిటీసీల ఫోరం జిల్లా అధ్యక్షుడు పత్తిరెడి రాజేశ్వర్, గ్రంథాలయ మాజీ చైర్మన్ ఎర్రవోతూ రాజేందర్, మున్సిపల్ మాజీ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి, నిర్మల్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు కాంగ్రెస్ సీనియర్ నాయకులు అల్లూరి మల్లారెడ్డి,పట్టణ అధ్యక్షులు నందేడపు చిన్ను, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అయ్యన్న గారి పోశెట్టి,మాజీ ఎంపీపీ సాదా సుదర్శన్, మాజీ ఏఎంసీ చైర్మన్ చిలుక రమణ, దిలావర్ పూర్ కాంగ్రెస్ అధ్యక్షులు సాగర్ రెడ్డి, కౌన్సిలర్లు కత్తి నరేందర్ ,ఎస్పిరాజు,తారక శ్రీ వాణి రఘువీర్, కొంతం గణేష్, కత్తి సురేష్, పత్తి విజ్ఞతేజ, అడ్ప శ్రీకాంత్, ఈటల శ్రీనివాస్, నగేష్ తదితరులు పాల్గొన్నారు.