Trending Now

వివేకానంద వీరంగం

(ప్రతిపక్షం విలేఖరి)

హైదరాబాద్, ఫిబ్రవరి 09: కుత్బుల్లాపూర్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే వివేకానంద మరోసారి వీరంగం వేశారు. అసెంబ్లీ వద్ద పోలీసులతో ఘర్షణకు దిగారు. సైఫాబాద్ ఏసీపీ సంజయ్‌ను యూజ్‌లెస్ ఫెలో అంటూ దుర్భాషలాడారు. సహనం కోల్పోయి కారు అద్దంపై కర్రతో దాడి చేశారు. ఆటోవాలాలకు న్యాయం చేయాలని కోరుతూ హైదర్‌గూడలోని ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఆటోల్లో అసెంబ్లీకి వచ్చి నిరసన తెలిపారు. వారిలో వివేకానందతోపాటు ఎమ్మెల్యేలు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, సుధీర్ రెడ్డి, మాధవరం కృష్ణారావు, పాడి కౌశిక్ రెడ్డి తదితరులు ఉన్నారు. ప్లకార్డులు పట్టుకుని అసెంబ్లీ వద్ద ధర్మా చేశారు. ఈ ధర్నా కాస్త ఉద్రిక్తతకు దారితీసింది. ఈ క్రమంలోనే పోలీసులకు, ఎమ్మెల్యే వివేకానందకు మధ్య ఘర్షణ తలెత్తింది.

మొదటిసారి కాదు
వివేకానంద ఇలా ప్రవర్తించడం ఇది మొదటిసారి కాదు. అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో ఓ టీవీ చానెల్ నిర్వహించిన చర్చా వేదికలో ఆయన ప్రవర్తన రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద దుమారం లేపింది. రామ్‌లీలా మైదానం వేదికగా జరిగిన బహిరంగ చర్చలో భూకజ్జాల విషయంలో బీజేపీ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే వివేకానంద మధ్య వాడి వేడిగా చర్చ జరిగింది. ఒకరిపై ఒకరు వ్యక్తిగత ఆరోపణలు కూడా చేసుకున్నారు. దీంతో ఒక్కసారిగా సహనం కోల్పోయిన వివేకానంద.. శ్రీశైలం గౌడ్‌పై దాడి చేసి గొంతు పట్టుకోవడంతో ఉద్రిక్తత తలెత్తింది. బీజేపీ, బీఆర్‌ఎస్ కార్యకర్తలు కూడా ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఈ ఘటన అప్పట్లో తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది.

Spread the love