వెలిచాల రాజేందర్ గెలుపు కోసం చిగురుమామిడిలో మంత్రి పొన్నం విస్తృత ప్రచారం..
ప్రతిపక్షం, కరీంనగర్/హుస్నాబాద్, ఏప్రిల్ 26: ‘గల్లా ఎగరేసి చెప్పండి’.. ఆగస్టు 15లోపు రుణమాఫీ చేసి చూపిద్దాం అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అంబానీ, అదానీల వద్ద మురుగుతున్న ప్రజాధనాన్ని వెలికి తీసి, ఎవరి సొమ్ము వారికి అప్పగిస్తామని, ఆ బాధ్యత కేంద్రంలో అధికారంలోకి రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. కాంగ్రెస్ పార్టీ కన్వీనర్, నియోజకవర్గ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు గెలుపు ఆకాంక్షిస్తూ.. హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలోని చిగురుమామిడి మండల కేంద్రాల్లో వేలాదిమంది కార్యకర్తలతో నిర్వహించిన భారీ రోడ్ షోలో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 2004నుండి 2014 వరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి హామీను అమలు చేసి దేశాన్ని అన్నపూర్ణగా తీర్చిదిద్దిందని, అనంతరం కేంద్రంలో బీజేపీ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీలో ప్రజలను హరిగోస పెట్టుకున్నయాని విమర్శించారు. కేంద్రంలో అధికారం చేపట్టిన బీజేపీ నిత్యవసర ధరలు చుక్కలు చూపిస్తున్నాయని ఆరోపణతో అధికారంలోకి వచ్చి, పదేళ్లలో దేశాన్ని దోచుకొని అదానీ, అంబానీలకు దారాదత్తం చేసిందని విమర్శించారు.
పదేళ్ల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అధికారం చేపట్టిన 48 గంటల్లోనే మహిళలకు ఉచిత బస్సు సదుపాయం కల్పించడంతోపాటు, రూ.500 కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ను అందిస్తూ మహిళల మనసుల్లో ఆదరాభిమానాలు చురగొందని పేర్కొన్నారు. ఇక ఆగస్టు 15లోపు రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని.. కాంగ్రెస్ శ్రేణులు గల్ల ఎగరేసుకొని చెప్పాల్సిందిగా సూచించారు. నియోజకవర్గ ప్రజలందరి ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా ఎదిగానని, నియోజకవర్గ ప్రజల ఆత్మగౌరవాన్ని మరింత పెంపొందించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. దేవుడి పేరు చెప్పి ఓట్ల అడిగే మూర్ఖులను దరిదాపులకు కూడా రానివ్వ వద్దని ఓటర్లకు సూచించారు. జిల్లా మంత్రిగా తనతోపాటు ఎమ్మెల్యేలు నియోజకవర్గం ఇన్చార్జిలు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు అందరూ కలిసి రాజేందర్ రావుని ఎంపీగా గెలిపించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ఆదేశానుసారం ప్రతి కార్యకర్త సైనికుల్లా పని చేయాలని కోరారు.
ఎన్నికల ప్రచారానికి నియోజకవర్గంలో పర్యటిస్తున్న మంత్రి పొన్నంతో పాటు అభ్యర్థి రాజేంద్ర రావుకు ఆయా మండలాల ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కంది తిరుపతిరెడ్డి, జడ్పీటీసీ సభ్యుడు గీకురు రవీందర్, నియోజకవర్గ నాయకురాలు కర్ణకంటి మంజుల రెడ్డి, జిల్లా నాయకులు చిట్టుమల్ల రవీందర్, సత్యనారాయణ రెడ్డి, దాసరి ప్రవీణ్ కుమార్ నేత, మైనార్టీ సెల్ మండల అధ్యక్షుడు షాబుద్దీన్, కిసాన్ సెల్ మండల అధ్యక్షుడు కాంతాల మహిపాల్ రెడ్డి, నాయకులు మాచమల్ల రమణయ్య, ఎనగందుల లక్ష్మణ్, దొబ్బల బిక్షపతి,గుంటి ఎల్లయ్య, ఖాతా తిరుపతి, మాచమల్ల కిషోర్, వంగ కనకయ్య తదితరులు పాల్గొన్నారు.