Trending Now

ఉద్యోగుల గోడు పట్టించుకోవట్లేదు.. ఈటల రాజేందర్

ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: తొర్రూరులో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ఈటల రాజేందర్ పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈరోజు ఒక లెక్చరర్ తన గోడును చెప్పుకున్నారు. తమ బాధలు ఎవ్వరూ పట్టించుకోవట్లేదని వాపోయారు. గత బీఆర్‌స్ ప్రభుత్వం, నేడు కాంగ్రెస్ పార్టీ కూడా తమ తమ ప్రయోజనాలే కానీ ఉద్యోగుల గోడు పట్టించుకోవట్లేదు. ఉపాధ్యాయులకు, లెక్చరర్లకు సరిగ్గా జీతాలు ఇవ్వడం లేదు. వారికి పూర్తిగా 12 నెలల జీతం రావడం లేదని వారు తెలిపారని ఈటల రాజేందర్ అన్నారు. తెలంగాణలో ఏ సంఘం వారికి సమస్యలు వచ్చినా వారికి నేను అండగా ఉంటాను. బీజేపీ పార్టీ బలపరిచిన ప్రేమేందర్ రెడ్డి గారు 40 ఏళ్లుగా ప్రజాసేవలో ఉన్నారు. పార్టీ కోసం ఎంతో శ్రమిస్తున్నారని గుర్తు చేశారు.

కేసీఆర్ నీళ్లు, నిధులు, నియామకాలు అంటూ తెలంగాణలో అధికారంలోకి వచ్చారు. కానీ ఉద్యోగాల సంగతి ఏమాత్రం పట్టించుకోలేదు. ఉద్యోగాలు రాని వాళ్లకు నిరుద్యోగ భృతి ఇస్తానని వారిని మభ్యపెట్టాడు. ఉద్యోగాలు లేవు, నిరుద్యోగ భృతి లేదని గుర్తు చేశారు. బీఆర్ఎస్ పార్టీపై అసంతృప్తితో కాంగ్రెస్‌కు ఓటు వేస్తే, నాలుగు వేలు నిరుద్యోగ భృతిగా ఇస్తానని చెప్పిన రేవంత్ రెడ్డి కూడా మాట తప్పాడు. అధికారంలోకి వచ్చి ఆరు నెలలవుతున్నా ఇంతవరకూ ఆ ఊసే లేదు. ఒడ్డెక్కేదాక ఓడ మల్లప్ప, ఒడ్డెక్కినాక బోడ మల్లప్ప అనే సామెతలా తయారయ్యారు.

కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధిక ట్యాక్సులు వసూలు చేస్తోందని స్వయంగా దేశ ప్రధాని నరేంద్రమోదీ, హోం మంత్రి అమిత్‌షా ప్రకటించారు. ఉద్యోగులకు పీఆర్‌సీ ఇంతవరకూ అమలు చేయలేదు. 2023 జూన్‌లో పీఆర్‌సీ అమలు చేస్తామన్నారు. కానీ ఏడాది గడిచినా చేయట్లేదు. ఉద్యోగులకు ఆరోగ్యభీమా కూడా సరిగ్గా అందడంలేదు. జర్నలిస్టులకు, ఉద్యోగులకు ఆరోగ్యశ్రీ డబ్బు కూడా రావట్లేదు. కాంట్రాక్టర్లకు డబ్బులిస్తున్నారు కానీ ఈ ప్రభుత్వాలు ఆర్టీసీ కార్మికులకు, ఉద్యోగులకు ఏమాత్రం జీతాలు కూడా సరిగ్గా ఇవ్వడం లేదు. అంగన్ వాడీ టీచర్లకు కూడా 18 వేల రూపాయలు ఇస్తానని చెప్పి రేవంత్ రెడ్డి ఇంతవరకూ ఇవ్వలేదు. 66 హామీలు చేసి, ఆరు నెలలలోనే ప్రజల చేత ఛీ కొట్టించుకున్నాడు.

రైతులకు రూ. 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తానని బీరాలు పలికాడు. దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నా అంటూ ప్రజలను మభ్య పెడుతున్నాడు. గత ప్రభుత్వంలో కేసీఆర్ కూడా లక్ష రుణమాఫీ చేస్తానని చెయ్యలేక పోయాడు. రింగురోడ్డు వద్ద స్థలాలు అమ్ముకుంటే వచ్చిన డబ్బు వడ్డీలు కట్టడానికే సరిపోయింది. ఇంక రేవంత్ రెడ్డి రెండు లక్షలు ఎలా రుణమాఫీ చేస్తాడు. వికలాంగులకు, స్త్రీలకు, వితంతువులకు, నిరుద్యోగులకు, వృద్ధులకు కొత్త పెన్షన్లు ఇస్తామని చెప్పాడు. కానీ మహిళలకు ఉచిత బస్సు తప్ప మరే పథకం అమలు కావట్లేదు. కేసీఆర్ తెలంగాణను దివాలా తీశారని, తెలంగాణ అప్పుల ఊబిలో కూరుకుపోయిందని, దివాలా తీసిందని చెప్తున్నాడు రేవంత్ రెడ్డి.

ఇప్పుడేమో 14 ఎంపీ సీట్లు గెలిపించి ఇస్తే.. రాహుల్‌గాంధీని ప్రధానిని చేస్తానని.. అప్పుడు ఇచ్చిన హామీలు నెరవేస్తామని చెప్తున్నాడు. గత ఎన్నికలలో ప్రతిపక్ష హోదా కూడా రాకుండా చతికిలబడ్డ కాంగ్రెస్ పార్టీకి ఎలా మెజారిటీ వస్తుంది. వారెలా అధికారం చేపడతారో తెలియట్లేదు. గతంలో అనేక సమస్యలపై బీజేపీ పార్టీ కొట్లాడుతోంది. కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే అతనికి ప్రభుత్వాన్ని ఎదిరించలేడు. కావలసిన పనులు సాధించలేడు. అందుకే బీజేపీకి ఓట్లు వేస్తే ప్రభుత్వాన్ని నిలదీసి సమస్యలు సాధిస్తామన్నారు. తెలంగాణలో అధిక ఎంపీ స్థానాలు సాధిస్తుందని ప్రజలు హామీ ఇస్తున్నారు. ఇక ఎమ్మెల్సీ ఎన్నికలలో కూడా బీజేపీని బలపరచండి. తెలంగాణ రాష్ట్ర శాసనసభలో వచ్చే ఎన్నికలలో ఎగిరే జెండా బీజేపీదే అని గుర్తు పెట్టుకోండి. ఇకపై వచ్చే సర్పంచ్ ఎన్నికలు మొదలుకొని ఎంపీటీసీ, జడ్పీటీసీ, అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలలో ఖచ్చితంగా రాబోయే పార్టీ భారతీయ జనతా పార్టీయే ఆయన స్పష్టంచేశారు.

2020లో కరోనా మహమ్మారి విజృంభణ కాలంలో ప్రపంచ దేశాల నాయకులు ప్రజలను కాపాడుకోలేక కన్నీళ్లు పెట్టారు. కానీ భారత ప్రధాని నరేంద్రమోదీ కన్నీళ్లు పెట్టలేదు. ధైర్యం చెప్పారు. వారికి సరైన తిండి, వసతి కల్పించారు. వైద్య సదుపాయాలు పెంచారు. యుద్ధ ప్రాతిపదికపై కరోనా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసి దేశప్రజలందరికీ ఉచితంగా అందించారు. ఇప్పుడు ప్రపంచంలో గొప్ప నాయకుడు ఎవరంటే నరేంద్రమోదీ పేరే మొదటి స్థానంలో ఉంది. కరోనా వల్ల అన్ని దేశాలు ఆర్థికంగా చితికిపోయి వెనుకబడి పోతుంటే మన భారత దేశం మాత్రం ఆర్థికాభివృద్ధిలో 11 వస్థానం నుండి 5 వస్థానానికి చేరుకుంది. కరోనావ్యాక్సిన్‌ను ఇతర దేశాలకు కూడా పేద దేశాలకు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ రెండు రోజుల సమయాన్ని బాగా సద్వినియోగం చేసుకుని ప్రతీఒక్కరు బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి గారిని గెలిపించవలసిందిగా ఈటల రాజేంద్ర కోరారు.

Spread the love

Related News

Latest News