190 జీవోను వెంటనే అమలు చేయాలి: కవిత

ప్రతిపక్షం, జూన్ 12: బంజారాహిల్స్‌లోని తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆ సంస్థ చీఫ్ కల్వకుంట్ల కవిత రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. 317 జీవో బాధితులైన ఉపాధ్యాయులు, ఉద్యోగులకు న్యాయం చేయాలంటే 190 జీవోను వెంటనే అమలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. జీవో విడుదలై తొమ్మిది నెలలు గడిచినా అమలులోకి తీసుకురాకపోవడం వెనుక కారణాలు ప్రభుత్వం వెల్లడించాలని కోరారు.

ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కమిటీల పేరుతో కాలయాపన చేస్తోందని కవిత ఆరోపించారు. 317 జీవో అంశంపై మంత్రులతో ఏర్పాటు చేసిన కేబినెట్ ఉపసంఘం మధ్యంతర పరిష్కారంగా 190 జీవోను తీసుకువచ్చిందని, అయితే ఇప్పటివరకు దానిని అమలు చేయకపోవడం ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోందన్నారు.

స్థానికత ఆధారంగా ఉద్యోగులను స్వస్థలాలకు బదిలీ చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినా, ఆ దిశగా ఎలాంటి చర్యలు కనిపించడం లేదని విమర్శించారు. అవసరమైతే అదనపు పోస్టులు సృష్టించి అయినా ఉద్యోగులకు న్యాయం చేయాలని ఆమె సూచించారు. ముఖ్యంగా 317 జీవో వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఉపాధ్యాయులు, వివిధ శాఖల ఉద్యోగులను వారి స్వస్థలాలకు పంపే ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు.

190 జీవో అమలును రేషనలైజేషన్ ప్రక్రియతో ముడిపెట్టకుండా ప్రత్యేకంగా అమలు చేయాలని కవిత స్పష్టం చేశారు. ఉద్యోగ సంఘాలు కూడా ఈ అంశంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని, వారికి తెలంగాణ రక్షణ సేన పూర్తి మద్దతు ఇస్తుందని తెలిపారు.

ఉద్యోగులు, ఉపాధ్యాయుల హక్కుల పరిరక్షణ కోసం తెలంగాణ రక్షణ సేన పోరాటం కొనసాగిస్తుందని, ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని కల్వకుంట్ల కవిత హెచ్చరించారు.

Spread the love

Related News

Latest News