Trending Now

దుబారా ఖర్చుకు సీఎం రేవంత్​ దూరం..

అనవసర ఖర్చులు పెట్టకుండా పాలన

సాధారణ పౌరుడిగా విమాన ప్రయాణం

అందర్ని ఔరా అనిపిస్తున్న రేవంత్​

హైదరాబాద్​, ప్రతిపక్షం స్టేట్​బ్యూరో: గత బీఆర్ఎస్​ప్రభుత్వం ప్రజల సొమ్మును నీళ్లలా ఖర్చుచేసి, అప్పుల తెలంగాణాగా మార్చిందని, తమ ప్రభుత్వం అనవసరపు ఖర్చులు చేయకుండా ఆర్థిక క్రమశిక్షణతో ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడ్తామని రేవంత్​రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం సందర్భంగా ప్రకటించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ముందు నుయ్యి, వెనక గొయ్యిలాగా ఉన్న ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ దుబారా ఖర్చులు చేయకుండా పాలన కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి ఆర్భాటాలు, ఆడంబరాలకు దూరంగా ఉంటూ, మిగతా వారికి ఆచరించి చూపిస్తున్నారు. అనవసర ఖర్చులతో రాష్ట్ర ఖజానాకు అదనపు భారం తీసుకురావద్దని నిర్ణయించుకున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. అందుకు తగ్గట్టుగా నడుచుకుంటూ ఔరా అనిపిస్తున్నారు.

దేశ రాజధాని ఢిల్లీ పర్యటనకు లేదా ఇతర రాష్ట్రాల పర్యటనకు వెళ్లినప్పుడు సాధారణంగా ముఖ్యమంత్రులు ప్రత్యేక విమానాల్లో వెళ్తుండడం ఇటీవల పరిపాటిగా మారింది. గతంలో సీఎంగా కేసీఆర్​ ఉన్నప్పుడు ప్రత్యేక విమానంలో పర్యటనలు కొనసాగించిన విషయం తెలిసిందే!. అయితే ప్రత్యేక విమానాల ద్వారా పర్యటిస్తే రాష్ట్ర ఖజానాకు భారీ ఎత్తున బొక్క పడుతుందన్న కారణంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ పద్ధతికి స్వస్తి చెప్పారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కొత్తలో అర్జెంట్​గా ప్రయాణం చేయాల్సిన ప్రత్యేక మైన పరిస్థితుల్లో ప్రత్యేక విమానాల్లో ఢిల్లీకి వెళ్లినప్పటికీ ఆ తర్వాత సాధారణ విమానాల్లోనే ప్రయాణిస్తున్నారు. ఇటీవల ఆంధ్ర ప్రదేశ్ లోని విశాఖపట్టణానికి, మహారాష్ట్ర రాజధాని ముంబైకి సాధారణ విమానంలోనే ప్రయాణించారు.

గత ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు అధికారిక కార్యక్రమాలకైనా లేదా వ్యక్తిగత అవసరాలకైన ఇతర రాష్ట్రాలకు వెళ్లినప్పుడు ప్రత్యేక విమానాల్లో ప్రయాణించేవారు. దాంతో ఆయా రాజకీయ పార్టీలు, ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. దుబారా ఖర్చు చేస్తున్నారని విమర్శలు వెల్లువెత్తాయి. ఆ పరిణామాలను కూడా పరిగణలోకి తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి అలాంటి విమర్శలకు తావు లేకుండా ఆచితూచి తనదైన శైలిలో వ్యవహరిస్తూ అందరి మన్ననలను పొందుతున్నారు.

Spread the love