ప్రతిపక్షం, జూలై 19: తెలంగాణలో నిరుద్యోగ యువతకు తమ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించిందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రజాకవి డాక్టర్ అందెశ్రీ స్మృతి వనం శంకుస్థాపన కార్యక్రమంలో మాట్లాడిన ఆయన, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు.
“మేకతోలు కప్పుకున్న తోడేళ్లు ఇప్పుడు ఉద్యోగాల గురించి మాట్లాడుతున్నారు. తమ కుటుంబ సభ్యులు కవిత, వినోద్ ఎన్నికల్లో ఓడిపోయిన వెంటనే మూడు నెలల్లోనే వారికి పదవులు కల్పించారు. కానీ రాష్ట్రంలోని లక్షలాది నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇవ్వాలనే ఆలోచన మాత్రం చేయలేదు” అంటూ గత ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని వ్యాఖ్యానించారు.
తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగ నియామకాలకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చిందని సీఎం స్పష్టం చేశారు. ఇప్పటివరకు 70 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామని పేర్కొంటూ, యువతకు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు.
నిరుద్యోగుల ఆశలు, ఆకాంక్షలను విస్మరించిన గత ప్రభుత్వానికి యువతే తగిన గుణపాఠం చెబుతుందని రేవంత్ రెడ్డి అన్నారు. “యువత మీకు సమాధి కట్టడం తథ్యం” అంటూ బీఆర్ఎస్ నాయకత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.
ప్రజా ప్రభుత్వానికి సోనియా గాంధీ, ప్రజాకవి అందెశ్రీ, ప్రజాగాయకుడు గద్దర్ వంటి మహనీయుల ఆలోచనలు, సిద్ధాంతాలే స్ఫూర్తి అని సీఎం పేర్కొన్నారు. వారి ఆశయాలకు అనుగుణంగా ప్రజల కోసం పనిచేయడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.
















