ప్రతిపక్షం, జూలై 18: తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలలు, గురుకుల విద్యార్థులకు ప్రభుత్వం భారీగా విద్యా సామగ్రిని అందించేందుకు సిద్ధమైంది. ఆగస్టు 15లోగా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 27 లక్షల మంది విద్యార్థులకు కొత్త యూనిఫామ్లతో పాటు అవసరమైన వస్తువులతో కూడిన కిట్లను పంపిణీ చేయనుంది.
ప్రతి విద్యార్థికి రెండు జతల యూనిఫామ్‌లు, బూట్లు, సాక్సులు, బెల్ట్‌తో కూడిన కిట్‌ను అందించనున్నారు. గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులకు స్కూల్ బ్యాగ్‌తో పాటు బెడ్డింగ్ సామగ్రి, ప్లేట్, గ్లాస్, ట్రంక్ బాక్స్, ట్రాక్ డ్రెస్, నైట్ డ్రెస్‌లను కూడా పంపిణీ చేయనున్నారు.
ఇంటర్మీడియట్ విద్యార్థులకు తొలిసారిగా ప్రత్యేక కిట్లను అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో బ్యాగ్, బెల్ట్, షూ, సాక్సులు ఉంటాయి. విద్యార్థులకు విద్యా సంవత్సరం ప్రారంభంలోనే అవసరమైన సామగ్రి అందేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.

















