చేనేతలను ఆదుకున్న ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదే గంగుల కమలాకర్

ప్రతిపక్షం బ్యూరో, ఉమ్మడి కరీంనగర్, జూలై 03: చేనేత రంగాన్ని బలోపేతం చేసేందుకు, నేత కార్మికుల కుటుంబాలను ఆదుకునేందుకు గత కేసీఆర్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను చేపట్టిందని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ నగరంలోని కొత్తపల్లిలో జరిగిన చేనేత పారిశ్రామిక, సహకార సంఘం నూతన పాలక వర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని, పాలక వర్గాన్ని సన్మానించారు.ఈ సందర్భంగా గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. “తెలంగాణలో చేనేత కార్మికులను ఆదుకున్న ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ మాత్రమే. సిరిసిల్ల నేత కార్మికులకు ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతోనే, రాష్ట్ర ప్రజలకు పండుగల సందర్భంగా అందించే చీరల తయారీ బాధ్యతలను కేసీఆర్ ప్రభుత్వం వారికి అప్పగించింది” అని గుర్తు చేశారు.ప్రస్తుత ప్రభుత్వంపై ఆయన విమర్శలు గుప్పించారు. వస్త్రాల టెండర్లను ఇతర రాష్ట్రాలకు అప్పగించడం ద్వారా స్థానిక చేనేత కార్మికుల కడుపు కొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల కార్మికులు ఉపాధి లేక రోడ్డున పడే పరిస్థితి నెలకొందన్నారు. రాబోవు రోజుల్లో తిరిగి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, ప్రభుత్వం రాగానే మళ్లీ చేనేత కార్మికులను ఆదుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో 18వ డివిజన్ కార్పొరేటర్ వాసాల రమేష్, చేనేత పారిశ్రామిక సంఘం అధ్యక్షులు మునిందర్, ఉపాధ్యక్షులు చంద్రమౌళి, కార్యదర్శి హనుమాండ్లు, మేనేజింగ్ కమిటీ సభ్యులు మరియు తదితర నాయకులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News