Trending Now

తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలి..

బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మచ్చ వేణుగోపాల్ రెడ్డి

ప్రతిపక్షం, సిద్దిపేట ఏప్రిల్ 20: ఆరుగాలం కష్టపడి పండించిన పంటను మార్కెట్ యార్డ్ వరకు తీసుకువచ్చిన సమయానికి కొనుగోలు జరగక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మచ్చ వేణుగోపాల్ రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. ప్రకృతి ఒకవైపు కన్నెర్ర చేస్తే.. కొనుగోలు కేంద్రాల్లో అరకొర వసతులు రైతులను కన్నీళ్లు పెట్టిస్తున్నాయన్నారు. సిద్దిపేట మార్కెట్ యార్డుకు వారం రోజుల క్రితం తీసుకొచ్చిన ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో అవి పూర్తిగా తడిసిపోయాయని.. దీనికి పూర్తి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని ఆరోపించారు. ఎలాంటి షరతులు, కటింగులు విధించకుండా తడిసిన ధాన్యాన్ని మొత్తం ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. శనివారం ఉదయం కురిసిన భారీ వర్షానికి సిద్దిపేట మార్కెట్ యార్డులో అమ్మకానికి తీసుకువచ్చిన వరి ధాన్యం మొత్తం తడిసి ముద్దయింది.

తడిసిన వరి ధాన్యం కల్లాలను బీఆర్ఎస్ నాయకులు మచ్చ వేణుగోపాల్ రెడ్డి, దరిపల్లి శ్రీనివాస్ లు పరిశీలించి రైతుల సాధక బాధకాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ.. మార్కెట్ యార్డ్ కు వచ్చిన ధాన్యాన్ని సరైన సమయంలో కొనుగోలు చేయకపోవడం వల్లే రైతులకు వర్షంతో ముప్పు వాటిలిందన్నారు. ఇది ముమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యమని మండిపడ్డారు. ధాన్యం కొనుగోలులో అలసత్వానికి గల కారణాలను పరిశీలించి వెంటనే కొనుగోలు ప్రారంభించాలని.. తడిసిన వరి ధాన్యాన్ని ఎలాంటి కటింగులు లేకుండా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తడిసిన వరి ధాన్యాన్ని ఒక్క గింజ లేకుండా ప్రభుత్వమే కొనుగోలు చేసిందని గుర్తు చేశారు.తడిసిన ధాన్యం కొనుగోలు చేసేంతవరకు రైతుల పక్షాన పోరాటం చేస్తామని, రైతులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అలాగే సిద్దిపేట మార్కెట్ యార్డులో నెలకొన్న హమాలీ కార్మికుల సమస్యను, లారీల సమస్యలను వెంటనే పరిష్కరించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.

Spread the love

Related News