Trending Now

‘ప్రతి ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి’

ప్రతిపక్షం, నిర్మల్ ప్రతినిధి: ఓటు హక్కు వజ్రాయుధంలాంటిదని ప్రతి ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ అన్నారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సిస్టమాటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలెక్టోరల్ పార్టీసిపేషన్ (స్వీప్) ఆధ్వర్యంలో తొలిసారి ఓటు వేయనున్న కళాశాల విద్యార్థినులకు పోలింగ్ పై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఓటు హక్కు అనేది దేశ ప్రజలకు రాజ్యాంగం కల్పించిన గొప్ప వరమని.. ప్రతి ఓటరు మే 13 పోలింగ్ రోజున విధిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. యువత తాము ఓటు వేయడమే కాకుండా కుటుంబ సభ్యులు ఓటు వేసేలా ఓటు హక్కు ప్రాధాన్యతను తెలియజెయాలంటూ ఎన్నికల ప్రక్రియను వివరించారు.

ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నచ్చకపోతే ఎన్నికల సంఘం ‘నోటా’ అనే అవకాశాన్ని కల్పించిందని అన్నారు. జిల్లాలో పార్లమెంట్ ఎన్నికల్లో నూతనంగా 7078 మంది ఓటర్లు తొలిసారి తమ ఓటు హక్కు ను వినియోగించుకోనున్నారని తెలిపారు. ఓటింగ్ శాతం పెరగడానికి యువత కృషి చేయాలని అన్నారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన నమూనా ఓటింగ్ మిషిన్ పనితీరును విద్యార్థులు పరిశీలించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, డీ.ఆర్.డీ.వో విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News