ప్రతిపక్షం, జూన్ 01: గత ప్రభుత్వ హయాంలో ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు ఆరోపణలు చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్ రెడ్డి, అనిరుధ్ రెడ్డి బంజారాహిల్స్‌లోని ఐసీసీసీ కార్యాలయంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణకు హాజరయ్యారు.
160 సీఆర్పీసీ కింద జారీ చేసిన నోటీసుల మేరకు సిట్ అధికారుల ఎదుట హాజరైన ఎమ్మెల్యేలు, తమ ఫోన్లు ఎన్నికల సమయంలో ట్యాపింగ్‌కు గురయ్యాయనే ఆరోపణలపై వివరాలు అందించారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా సేకరించిన సాంకేతిక ఆధారాలను అధికారులు వారికి చూపించి, వారి వాంగ్మూలాలను నమోదు చేస్తున్నారు.
ఇప్పటికే ఎన్నికల కాలంలో ఈ ఇద్దరు ఎమ్మెల్యేల ఫోన్లు నిఘాలో ఉన్నట్లు ప్రాథమిక ఆధారాలు లభించినట్టు సమాచారం. దీంతో కేసు దర్యాప్తు కీలక దశకు చేరుకుంది.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపగా, ఈ కేసులో ఇప్పటికే పలువురు మాజీ అధికారులను సిట్ విచారిస్తోంది. తాజా విచారణతో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.

















