- ఏఐసీసీ ఆమోదంతో నియామక పత్రం అందజేత
- ఢిల్లీలో అధికారిక ప్రకటన
ప్రతిపక్షం,నంగునూరు, జూలై 11: కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ సిద్ధిపేట జిల్లా చైర్మన్ గా నంగునూరు మండలం బద్దిపడగ గ్రామానికి చెందిన తప్పెట శంకర్ నియమితులయ్యారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం ఆమోదం తెలిపింది. శుక్రవారం ఢిల్లీలోని ఇందిరా భవన్ లో జరిగిన కార్యక్రమంలో ఏఐసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ రాజేంద్ర పాల్ గౌతమ్, టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణలు నియామక పత్రాన్ని తప్పెట శంకర్ కు అందజేశారు. ఈ సందర్భంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం, రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు, వాటిపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు సమర్థవంతంగా ఎలా సమాధానం చెప్పాలనే అంశాలపై ఏఐసీసీ, టీపీసీసీ నాయకుల మధ్య సుదీర్ఘ చర్చ జరిగినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
అనంతరం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని సంస్థా గతంగా బలోపేతం చేయడంలో భాగంగా సిద్దిపేట జిల్లా ఎస్సీ సెల్ కొత్త కమిటీని ప్రకటించారు. ఈ కమిటీలో జిల్లా చైర్మన్ గా తప్పెట శంకర్‌ను నియమించగా, కొత్తూరి నరహరి, బండమీది తిరుపతిలను జిల్లా వైస్ చైర్మన్లుగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. నియామక పత్రం అందుకున్న అనంతరం తప్పెట శంకర్ మాట్లాడుతూ తనపై విశ్వాసం ఉంచి బాధ్యతలు అప్పగించిన ఏఐసీసీ ఎస్సీ సెల్ ఛైర్మన్ రాజేంద్ర పాల్ గౌతమ్, టీపీసీసీ ఎస్సీ సెల్ ఛైర్మన్ కవ్వంపల్లి సత్యనారాయణకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతం కోసం జిల్లా వ్యాప్తంగా ఎస్సీ సెల్ ను మరింత చురుకుగా పనిచేసేలా కృషి చేస్తానని చెప్పారు. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లి కాంగ్రెస్ బలోపేతానికి అంకితభావంతో పనిచేస్తానని పేర్కొన్నారు.
తన నియామకానికి సహకరించిన రాష్ట్ర ఇంఛార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, రాష్ట్ర నాయకుడు గాడిపల్లి రఘువర్ధన్ రెడ్డి, టీపీసీసీ ఎస్సీ సెల్ వైస్ ఛైర్మన్ కొమ్ము విజయ్ కుమార్ తదితరులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ఎస్సీ సెల్ వైస్ చైర్మన్లు కొమ్ము విజయ్‌కుమార్, దుర్గం శేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈ నియామకంతో సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ కొత్త నాయకత్వం లభించిందని, జిల్లా స్థాయిలో పార్టీ కార్యకలాపాలకు మరింత ఊపు వచ్చే అవకాశముందని కాంగ్రెస్ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి.





















