ప్రతిపక్షం, హైదరాబాద్: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు షాకిచ్చే యోచనలో ఏఐసీసీ ఉన్నట్లు తెలుస్తోంది. సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా ఇప్పటికే ఆయన పేరును ఆ పార్టీ ప్రకటించింది. అయితే ఆయన తీరుతో అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. ఇప్పుడు ఆ టికెట్ మరొకరికి ఇచ్చే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తేనే.. ఎంపీ టికెట్ ఉంటుందని దానంకు ఏఐసీసీ ఇదివరకే స్పష్టం చేసింది. దీంతో మూడో జాబితాలో దానం నాగేందర్ పేరును అధికారికంగా ప్రకటించింది కాంగ్రెస్. అయితే ముందు ఓకే చెప్పి తర్వాత ఆయన తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయలేదు. ఈలోపు ఆయన ఎన్నికపై హైకోర్టులో పిటిషన్లు దాఖలు అవుతున్నాయి. కోర్టు సైతం ఆయనకు నోటీసులు ఇచ్చింది. ఇదంతా పరిగణనలోకి తీసుకున్న ఏఐసీసీ దానంను తప్పించి.. ఆ స్థానంలో మరో అభ్యర్థిని నిలపాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ పేరు తెర మీదకు వచ్చింది. ఆయన పేరును ఏఐసీసీ పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఒకట్రెండు రోజుల్లో అధిష్టానం నిర్ణయం ఏంటన్నదానిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.