ప్రతిపక్షం, జూన్ 25: అహ్మదాబాద్–ముంబై తేజస్ రాజధాని రైలులో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుడికి భోజనంలో ఈగ కనిపించడం కలకలం రేపింది. రైలులో వెజ్ బిర్యానీ ఆర్డర్ చేసిన ప్రయాణికుడు భోజనం చేస్తుండగా అందులో ఈగ ఉండటాన్ని గుర్తించాడు. దీంతో వెంటనే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశాడు.
ప్రయాణికుడి ఫిర్యాదుపై స్పందించిన రైల్వే భోజన సేవల సంస్థ క్షమాపణలు తెలిపి, కొత్త భోజనం అందించేందుకు ముందుకొచ్చింది. అయితే ప్రయాణికుడు ఆ ప్రతిపాదనను తిరస్కరించినట్లు సమాచారం. ఘటనను తీవ్రంగా పరిగణించిన అధికారులు పూర్తి వివరాలను పరిశీలించారు.
దర్యాప్తులో భోజన నాణ్యతలో నిర్లక్ష్యం జరిగినట్లు తేలడంతో భోజన సరఫరా బాధ్యతలు నిర్వహిస్తున్న క్యాటరింగ్ సంస్థపై చర్యలు తీసుకున్నారు. ఆ సంస్థకు రూ.లక్ష జరిమానా విధించినట్లు అధికారులు వెల్లడించారు. ప్రయాణికులకు నాణ్యమైన, పరిశుభ్రమైన ఆహారం అందించడంలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించబోమని స్పష్టం చేశారు.

















